జమ్ముకశ్మీర్‌పై గాజా ఉద్రిక్తతల ప్రభావం?

26 Oct, 2023 07:08 IST|Sakshi

శ్రీనగర్: ఇజ్రాయెల్- పాలస్తీనా సంస్థ హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్‌లో సంక్షోభం చోటు చేసుకుంది. దీని ప్రభావం జమ్మూ కాశ్మీర్‌లో నిరసనలకు దారితీసే ముప్పును మరింతగా పెంచుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా శ్రీనగర్‌లోని 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, భద్రతా సంస్థల సమావేశం జరిగింది. 

భద్రతా ప్రణాళికల గురించి ఈ సమావేశంలో చర్చించామని, రాబోయే రోజుల్లో నిరసనలు తలెత్తితే, వాటిని ఎలా నిరోధించాలనే దానిపై దృష్టి పెట్టామని ఒక సీనియర్‌ అధికారి మీడియాకు తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం దిశగా సమావేశం జరిగిందని పేర్కొన్నారు.

ఈ అత్యున్నత సమావేశంలో విదేశీ ఉగ్రవాదుల పాత్రపై కూడా చర్చ జరిగింది. ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో హతమైన 46 మంది ఉగ్రవాదుల్లో 37 మంది పాకిస్తానీలేనని అధికారిక సమాచారం. 9 మంది మాత్రమే స్థానికులు ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లోని 33 ఏళ్ల ఉగ్రవాద చరిత్రలో స్థానిక ఉగ్రవాదుల కంటే విదేశీ ఉగ్రవాదుల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

కశ్మీర్ లోయలో ప్రస్తుతం దాదాపు 130 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నారని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా శ్రీనగర్‌లో జరిగిన ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు, ఉత్తర కమాండ్ ఆర్మీ కమాండర్ ఉపేంద్ర ద్వివేది అధ్యక్షత వహించారు. జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, చినార్ కార్ప్స్ కమాండర్,రాష్ట్ర పరిపాలన, భద్రతా సంస్థల ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఎన్నికల బరిలో ‘మిజోరం’ కోటీశ్వరులు

మరిన్ని వార్తలు