‘ప్రభుత్వ ప్రికాషనరీ’ డోస్‌కు అనుమతించండి

14 Jun, 2022 01:16 IST|Sakshi

కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: అర్హులందరికీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రికాషనరీ డోస్‌ ఇవ్వడానికి అనుమతివ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి మన్సుక్‌ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తెలం గాణ వద్ద 32 లక్షల వ్యాక్సిన్‌ డోసులు నిల్వ ఉన్నాయని, వాటి గడువు కూడా సమీపిస్తోందని చెప్పారు.

పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ల రూపంలో కరోనా కేసులు పెరుగుతున్నందున, రెండు డోసులు పూర్తిచేసుకొన్న అర్హులకు ప్రికాషనరీ డోస్‌ ఇవ్వడం వల్ల వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు. ప్రభుత్వ వైద్యంలో ప్రస్తుతం 60 ఏళ్లు దాటినవారికి మాత్రమే ప్రికాషనరీ డోస్‌ ఇచ్చేందుకు కేంద్రం అనుమతించిందని పేర్కొన్నారు. 18 ఏళ్లుపైబడిన వారికి ఏప్రిల్‌ 10 నుంచి ప్రికాషనరీ డోస్‌ ఇచ్చేందుకు కేవలం ప్రైవేటు ఆసుపత్రులకే అనుమతించిందని చెప్పారు.

ప్రైవేటుతోపాటు ప్రభుత్వ కేంద్రాల్లోనూ 18–59 ఏళ్ల వయస్సన్నవారికి ప్రికాషనరీ డోస్‌ ఇచ్చేందుకు అనుమతిస్తే ఫలితాలు గణనీయంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతోందని, ఈ నెల 3న రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటింటికీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా పదిరోజుల్లో 1.30 లక్షలమందికి వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు మరింత పెంచనున్నట్లు చెప్పారు. టీబీ నిర్మూలన కోసం అమలు చేస్తున్న నిక్షయ్‌మిత్ర కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. సమీక్షలో ఉన్నతాధికారులు రిజ్వీ, శ్వేతా మహంతి, గంగాధర్, శ్రీనివాస్‌రావు, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు