టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు పరీక్ష ఎలా రాస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..

12 Apr, 2023 08:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్పీ) ఉద్యోగులు అది నిర్వహించే పరీక్షలు ఎలా రాస్తారు. వారిని పరీక్షపత్రాల తయారీకి ఎలా అనుమతిస్తారు?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల ప్రశ్నపత్రం లీకేజీపై హైకోర్టుకు మంగళవారం సిట్‌ దర్యాప్తు స్థాయీ నివేదిక సీల్డ్‌ కవర్‌లో సమర్పించింది.

అయితే నిందితుల వివరాలను ఇవ్వాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పేపర్‌ లీకేజీ కేసును సిట్‌ పారదర్శకంగా దర్యాప్తు చేయలేదని, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తోపాటు మరో ఇద్దరు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. సిట్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ నివేదిక అందజేసి వాదనలు వినిపించారు. దర్యాప్తు నివేదికను పిటిషనర్లకు ఇవ్వాలని, వారి తరఫు సీనియర్‌ న్యాయవాది వివేక్‌ ఠంకా న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.

సీల్డ్‌ కవర్‌ నివేదికలను బహిర్గతం చేయవచ్చని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పేర్కొందని ఠంకా చెప్పారు. దర్యాప్తులో తీవ్ర లోపాలున్నాయని, సాక్ష్యాలు మాయమవుతున్నాయని అన్నారు. సిట్‌ చైర్మన్‌పై ఆరోపణలు ఉన్నాయని, సరీ్వస్‌ కమిషన్‌ ఏర్పాటులోనూ లోపాలున్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రవాస భారతీయుల పాత్ర ఉందన్నారు. ఇది 30 లక్షల మంది భవిష్యత్‌తో ముడిపడి ఉన్న అంశమని అన్నారు. సెక్షన్‌ అధికారి వద్ద మాత్రమే కాకుండా చైర్మన్, కార్యదర్శి వద్ద కూడా పాస్‌వర్డ్‌ ఉంటుందన్నారు. 

పారదర్శకంగా సాగని దర్యాప్తు 
సిట్‌ దర్యాప్తు పారదర్శకంగా సాగడంలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్‌ ఠంకా అన్నారు. ఈ క్రమంలో ప్రశ్నపత్రాలను ఎవరు తయారీ చేశారు.. ఏ ఏజెన్సీకి అప్పగించారు.. అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పరీక్షలు రాసేవారిని విధులకు ఎందుకు అనుమతించారని అడుగగా, పరీక్షలు రాసేవారిని నిర్వహణ ప్రక్రియకు దూరంగా పెట్టినట్లు ఏజీ చెప్పారు. దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలతో నివేదికను సమరి్పస్తామని, ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులతోపాటు మరికొన్ని వివరాలు అందాల్సి ఉందన్నారు.

ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులుండగా, 17 మందిని అరెస్ట్‌ చేశామని పేర్కొన్నారు. ఒకరు మాత్రం న్యూజిలాండ్‌లో ఉన్నారని అన్నారు. సీబీఐ దర్యాప్తు అవసరం లేదని నివేదించారు. ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేశారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ

మరిన్ని వార్తలు