విద్యార్థులకు తెలియకుండానే.. దరఖాస్తులు అప్‌లోడ్‌

23 Apr, 2022 04:31 IST|Sakshi

సర్టిఫికెట్లను ఎవరో అప్‌లోడ్‌ చేశారు 

ఎక్కడా సీట్ల బ్లాకింగ్‌ జరగలేదు: కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఎక్కడా సీట్ల బ్లాకింగ్‌ జరగలేదని కాళోజీ నారాయణరావు హెల్త్‌ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఏడు సీట్లకు సంబంధించి ఇతర రాష్ట్రాల అభ్యర్థుల టెన్త్, ఇంటర్‌ సర్టిఫికెట్లు, ఆధార్, నీట్‌ అర్హతకార్డు వంటివన్నీ ఇతరులెవరో అప్‌లోడ్‌ చేసి దరఖాస్తు చేసినట్టుగా భావిస్తున్నా మని తెలిపారు. అయితే తమను తప్పుదారి పట్టించేందుకు అభ్యర్థులే ఈ నాటకం ఆడుతున్నారా? లేక ప్రైవేట్‌ ఏజెన్సీలేమైనా అక్రమాలకు పాల్పడ్డాయా అన్నదానిపై విచారణ జరుగుతోందన్నారు. పీజీ మెడికల్‌ సీట్ల బ్లాకింగ్‌ స్కాంపై శుక్రవారం వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుతో కలిసి కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

సొంత రాష్ట్రంలోని మంచి కాలేజీలో చేరి, ఇక్కడా చేరినట్టు అనుమానం రావడంతో.. మార్చి 16న కొందరు అభ్యర్థులకు లేఖలు రాశామని.. సీట్లు బ్లాక్‌ చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించామని తెలిపారు. వివిధ విడతల కౌన్సెలింగ్‌ అనంతరం 37 సీట్లలో ఉన్నతర్యాంకు వారు దరఖాస్తు చేశారని.. వారిలో ముగ్గురికి సొంత రాష్ట్రాల్లో మంచి సీట్లు వచ్చే అవకాశం ఉండటంతో తిరస్కరించామని వివరించారు.

మిగతా 34 సీట్లకుగాను 14 మంది ఇక్కడ చేరారన్నారు. మరో ఏడుగురికి సంబంధించి అభ్యర్థులు కాకుండా ఇతరులు దరఖాస్తు చేసినట్టు గుర్తించామని తెలిపారు. వారు బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌కు చెందినవారని వెల్లడించారు. సాధారణంగా మాప్‌ అప్‌ విడత తర్వాత మిగిలిన సీట్లను మేనేజ్‌మెంట్లకు ఇవ్వాలని, కానీ మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆ తర్వాతా సీట్లు మిగిలితేనే ఎన్నారై కోటా కింద మార్చుకునేందుకు ప్రైవేట్‌ కాలేజీలకు అనుమతి ఉంటుందన్నారు. 

గవర్నర్‌కు నివేదిస్తాం..: సీట్ల బ్లాకింగ్‌కు సంబంధించిన ప్రచారం నేపథ్యంలో గవర్నర్‌కు సమగ్ర నివేదిక ఇస్తామని వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు సీటు వదులుకుంటే ఇప్పటివరకు రూ.5 లక్షలు జరిమానా విధించే వారమని, దాన్ని రూ.20 లక్షలకు పెంచామని చెప్పారు. 2017 నుంచి నీట్‌ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నందున మేనేజ్‌మెంట్‌ సీట్లకు సంబంధించి సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. 2019లో ఇలాగే ముగ్గురు విద్యార్థులపై నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ)కు లేఖ రాశామని.. బ్లాకింగ్‌ జరగలేదని ఎన్‌ఎంసీ తేల్చిందని చెప్పారు. అన్నిరాష్ట్రాల పీజీ సీట్లలో ఎవరెవరు చేరారో వెబ్‌సైట్లలో పెట్టడం లేదా కామన్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించడం ద్వారా అక్రమాలకు చెక్‌ పెట్టవచ్చని తెలిపారు.

మరిన్ని వార్తలు