మరో రెండ్రోజులు చలి!

26 Jan, 2022 04:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, ఈశాన్య దిక్కుల నుంచి బలంగా గాలులు వీస్తుండగా... దీనికితోడు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావడంతో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మంగళవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.

ప్రస్తుతం నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ మేర తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పతనం కానున్నాయి. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 5 డిగ్రీల మేర తగ్గనున్నాయి.

ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల లోపు నమోదవుతాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. చలి తీవ్రత నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల అధికారులకు సూచనలు చేసింది.

మరిన్ని వార్తలు