ఆర్థిక అవకతవకలు..పన్ను ఎగవేత! 

8 Dec, 2022 04:31 IST|Sakshi

వంశీరాం బిల్డర్స్‌పై ఐటీ దాడుల్లో గుర్తింపు 

మొత్తం 19 ప్రాంతాల్లో సోదాలు 

చైర్మన్‌ సుబ్బారెడ్డి లాకర్లు తెరిచిన అధికారులు 

భారీగా బంగారం, నగదు, కీలక పత్రాలు స్వాధీనం 

కావూరి హిల్స్‌లోని ఆదిత్య ఇంట్లోనూ తనిఖీలు 

సాక్షి, హైదరాబాద్‌:  రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వంశీరాం బిల్డర్స్‌పై ఐటీ అధికారుల దాడులు బుధవారం రెండోరోజు కూడా కొనసాగాయి. వంశీరాం బిల్డర్స్‌ పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా అధికారులు గుర్తించినట్టు తెలిసింది. వినియోగదారులకు విక్రయించిన ఫ్లాట్లు, కమర్షియల్‌ ప్రాంతాలకు సంబంధించిన లావాదేవీల్లో పెద్ద ఎత్తున ఆదాయ పన్ను ఎగ్గొట్టినట్టుగా వెల్లడైందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా సంస్థ చైర్మన్‌ సుబ్బారెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగించడంతో పాటు ఆయ­న బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు తెరిపించారు. వాటిల్లో భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, విలువైన స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు చేసిన అధికారులు, బుధవారం ఉదయం నుంచి మొత్తం 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సుబ్బారెడ్డితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఈ సోదాలు కొనసాగినట్లు తెలుస్తోంది.  

ఆదాయానికి తగ్గట్టుగా లేని పన్ను చెల్లింపులు! 
వంశీరాం సంస్థలో పనిచేసే ఉద్యోగుల పేరిట తెరిపించిన ఖాతాల ద్వారా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన అధికార యంత్రాంగం ఆ మేరకు పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఆదిత్య అనే వ్యక్తితో కలిసి సుబ్బారెడ్డి ఆరెంజ్‌ లైనర్‌ ప్రాపర్టీస్‌లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ సంస్థలో వారిద్దరూ డైరెక్టర్లుగా కూడా ఉన్నట్టు తెలిసింది.

దీంతో కావూరి హిల్స్‌లోని ఆదిత్య ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. సుబ్బారెడ్డి ఇంట్లో దొరికిన కీలక పత్రాలు, ఇతరుల భూముల అభివృద్ధి ఒప్పంద పత్రాలు, వారికి ఇచ్చిన అడ్వాన్స్‌లు తదితర పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టి, వాటి విక్రయాలతో భారీ ఎత్తున ఆదాయం సమకూరినా.. ఆ స్థాయిలో పన్ను చెల్లింపులు చేయలేదని అధికారులు గుర్తించినట్టు తెలిసింది.

అయితే ఈ సోదాల్లో ఎంత మొత్తం బంగారం, నగదు బయటపడిందీ, కీలక స్థిరాస్తి పత్రాల విలువ ఎంత? అన్న దా­నిపై ఐటీ అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఇలావుండగా ఐటీ అధికారులు నిర్వహిస్తున్న దాడులతో సుబ్బారెడ్డి కుటుంబంలోని వారు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, అందు కోసం ఓ ఆసుపత్రి నుంచి వచ్చిన డాక్టర్లతో ఐటీ అధికారులు వారికి బీపీ పరీక్షలు నిర్వహింప చేశారని తెలిసింది. 

మరిన్ని వార్తలు