చిరిగిన పుస్తకాలు..విరిగిన కుర్చీలు

5 May, 2022 10:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చిరిగిన పుస్తకాలు..విరిగిన కుర్చీలు.. తిరగని పంకాలు.. ఇదీ మన గ్రంథాలయాల్లో నెలకొన్న పరిస్థితి. రాష్ట్రంలో 80 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగ యువతకు గ్రంథాలయాల్లో కుర్చునేందుకు కుర్చీలు కూడా దొరకడంలేదు. ఉన్న కుర్చీలు ఎక్కడ నడ్డివిరుస్తాయోననే ఆందోళన.. ఫ్యాను తిరగక ఉక్కపోత వెరసి ఉద్యోగార్థులకు ఈ లైబ్రరీలు చెమటలు కక్కిస్తున్నాయి.

మరోవైపు గ్రంథాలయాలకు రావాల్సిన నిధులకు స్థానిక సంస్థలు గండికొడుతున్నాయి. వసూలు చేసే ఆస్తిపన్నులో 8 శాతం రావాల్సిన సుంకాన్ని సైతం ఇవ్వకుండా ఎగ్గొడుతున్నాయి. నగర గ్రంథాలయ సంస్థకు జీహెచ్‌ఎంసీ ఏకంగా రూ.800 కోట్ల మేర బకాయిపడింది. ఈ నిధులు సకాలంలో రాకపోవడంతో పాత పుస్తకాలతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా..ఉద్యోగుల వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అవసరాల కోసం నెలకు రూ.15 లక్షలకు ఖర్చవుతున్నాయి.  

గ్రంధాలయాలు కిటకిట 
పోటీ పరీక్షల శిక్షణ సంస్థలన్నీ గ్రేటర్‌లోనే కేంద్రీకృతమయ్యాయి. కోచింగ్‌ కోసం ఇక్కడి అభ్యర్థులే కాకుండా తెలంగాణ, ఏపీ, ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థు లు కూడా ఇక్కడికే వస్తుంటారు. వీరిలో చాలా మంది ఆయా కోచింగ్‌ సెంటర్లు, వర్సిటీ, ఇతర గ్రం«థాలయాలకు సమీపంలోని ప్రైవేటు హాస్టళ్లు, గదులను అద్దెకు తీసుకుని ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. వాటిలో కంబైన్డ్‌ స్టడీస్‌కు అవకాశం లేకపోవడం, ఉన్న వాటిలోనూ సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో సమీపంలోని నగర, జిల్లా, మండల కేంద్ర గ్రంధాలయాలను ఆశ్రయిస్తున్నారు.

అఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర గ్రంధాలయం సహా చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, ఓయూ, తెలుగు విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలు అభ్యర్థులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ కావాల్సిన గ్రంథాల యాలు..ఏళ్ల తరబడి తాళపత్ర గ్రంథాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, నవలలు, సాహిత్యం, కథలు, నిఘంటవులు, న్యూస్‌ పేపర్లు, కరెంట్‌ ఎఫైర్స్‌ బుక్స్‌కే పరిమితవుతున్నాయి.  

కుర్చీ దొరకదు..ఫ్యాన్లు తిరగవు 
ఆయా గ్రంధాలయాల్లో విద్యార్థుల నిష్పత్తి మేరకు ఫర్నీచర్‌ లేకపోవడం ఇబ్బందిగా మారింది. అభ్యర్థులే స్వయంగా కుర్చీలు, ప్యాడ్‌లు కొనుగోలు చేసుకోవాల్సివస్తోంది. మార్కెట్లో రకరకాల పుస్తకాలు అందుబాటులోకి వస్తే..ఆయా గ్రం«థాలయాల్లో మాత్రం ఇప్పటికీ పాత పుస్తకాలే దర్శనమిస్తున్నాయి. పోటీ పరీక్ష ల పుస్తకాలే కాదు మంచినీరు ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో  ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే విద్యార్థులు అడిగిన పుస్తకాలను కొను గోలు చేసి అందుబాటులో ఉంచుతున్నట్లు గ్రంథపాలకులు చెప్పుతున్నప్పటికీ..ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. పుస్తకాలు వితరణకు దాతలు సుముఖంగా ఉన్నప్పటికీ...వాటిని తీసుకుని భద్రపరిచేందుకు అనువైన స్థలం లేకపోవడం గమనార్హం.  

కనీస సదుపాయాలు లేవు
ఇంట్లో చదువుకునేందుకు అనువైన వాతావరణం లేదు. కోచింగ్‌ సెంటర్లకు వెళ్లే ఆర్థిక స్తోమత కూడా లేదు. గ్రంథాలయంలో  ఏకాంతంగా కూర్చొని నచ్చిన పుస్తకాన్ని చదువుకోవచ్చని భావించి ఇక్కడికి వచ్చాం. తీరా ఇక్కడ కూర్చొని చదువుకునేందుకు కుర్చీలే లేవు. మేమే స్వయంగా వీటిని సమ కూర్చుకోవాల్సి వస్తుంది. వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన ఫ్యాన్లు  కూడా లేవు. ఉన్నవాటిలోనూ చాలా వరకు పని చేయడం లేదు.  
–హరికృష్ణ, మెదక్

భోజనం, మంచినీటి వసతి కల్పించాలి 
వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం రూ.5 భోజనం సరఫరా చేస్తుంది. అయితే నాణ్యత లేకపోవడంతో తినలేకపోతున్నాం. హోటళ్లలో తిందామంటే ఖర్చులకు డబ్బులు కూడా లేవు. ఖాళీ కడుపుతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాదు గ్రంధాలయంలో తాగునీరు కూడా లేకపోవడంతో బాటిళ్లను వెంట తెచ్చుకోవాల్సి వస్తుంది. కుర్చీలు లేక చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది.  
–శివకుమార్, సంగారెడ్డి  

(చదవండి: పక్కాగా లెక్క.. బడి బయట పిల్లలెందరు..?)

మరిన్ని వార్తలు