కేసీఆర్‌కు గాయం.. సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం

8 Dec, 2023 10:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని మోదీ ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్బంగా కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆరోగ్యశాఖ కార్యదర్శిని యశోద ఆసుపత్రికి పంపించారు సీఎం రేవంత్‌. 

కాగా, ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా..‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరోవైపు, కేసీఆర్‌ గాయంపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. ట్విట్టర్‌లో కవిత..‘బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు స్వల్ప గాయం కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో నిపుణుల సంరక్షణలో ఉన్నారు. మద్దతు, శుభాకాంక్షలు వెల్లువెత్తడంతో, నాన్న త్వరలో పూర్తిగా కోలుకోనున్నారు. అందరి ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. మాజీ సీఎం కేసీఆర్‌ నిన్న(గురువారం) అర్ధరాత్రి ఆయన ఫామ్‌హౌస్‌లోని బాత్‌రూమ్‌లో కాలు జారి కిందపడిపోయారు. ఈ సందర్భంగా ఎడమ కాలి తుంటికి రెండు చోట్ల గాయమైనట్టు వైద్యులు తెలిపారు. అలాగే, తుంటి భాగంగాలో స్టీల్‌ ప్లేట్‌ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ‍ప్రమాదంలో తుంటి బాల్‌ డ్యామేజీ అయినట్టు వైద్యులు చెబుతున్నారు.  దీంతో, ఆయనను సోమాజిగూడలోని యశోదకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేటీఆర్‌, హరీశ్‌ రావు, కవిత యశోద ఆసుపత్రిలోనే ఉన్నారు. వీరితో చర్చించిన తర్వాతే కేసీఆర్‌కు సర్జరీ చేసే అవకాశం ఉంది. 

>
మరిన్ని వార్తలు