కలెక్టర్‌ హరిచందనపై.. మక్తల్‌ ఎమ్మెల్యే మండిపాటు

30 Jul, 2022 13:31 IST|Sakshi

ఎమ్మెల్యే పదవి పోయినా పర్లేదు.. నేనేంటో చూపిస్తా: ఎమ్మెల్యే చిట్టెం

నారాయణపేట: ‘జిల్లాలో అడ్మినిస్ట్రేషన్‌ వ్యవస్థ జీరోగా తయారైంది.. నా ఎమ్మెల్యే పదవి పోయినా పర్లేదు.. నేనేంటో చూపిస్తా.. ఇక్కడ నియంత పాలన సాగదు’ అంటూ నారాయణపేట జిల్లా మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కలెక్టర్‌ దాసరి హరిచందనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజమ్మ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖ ఎజెండా చదువుతుండగా సమావేశానికి డీఈవో ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. 


‘కలెక్టరే సమావేశాలకు రారు.. ఇక జిల్లా అధికారులు ఎందుకు వస్తార’ని అసహనం వ్యక్తం చేశారు. ‘జెడ్పీ సమావేశమంటే పిల్లలాటైంది.. ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరూ పనికిమాలిన వాళ్లా.. వచ్చేసారి అందరం కలసి కలెక్టరేట్‌కు వెళ్లి జెడ్పీ మీటింగ్‌ పెట్టాలి’అని అన్నారు. ఇక్కడ మీటింగ్‌ జరుగుతుంటే, అక్కడ (కలెక్టరేట్‌లో) కలెక్టర్‌ రహస్య సమావేశాలు పెట్టడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ‘తెలంగాణ తెచ్చుకుంది.. జిల్లా వచ్చింది ఇందుకోసమేనా’ అని అసంతృప్తి వెళ్లగక్కారు. ఐదుగురు కనిపిస్తే కలెక్టర్‌కు బుగులు పుడుతుందని, వెంటనే పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తారని అన్నారు. సంగంబండ ముంపు బాధితులు కలెక్టరేట్‌కు వస్తే వారిని అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. 

మక్తల్‌ నుంచి ఓ మహిళా సర్పంచ్‌ సమస్య పరిష్కారం కోసం వస్తే అగౌరవపరిచారని, ఇదే కలెక్టర్‌ బిల్డింగ్‌పై నుంచి దూకి చస్తానని ఆమె తనతో ఫోన్‌లో చెప్పారన్నారు. జిల్లాకేంద్రంలో రూ.కోట్ల విలువైన ఎస్‌ఎల్‌ డిగ్రీ కళాశాలను ప్రభుత్వానికి ఇస్తే తమ సొసైటీ బిల్డింగ్‌ దగ్గరికి ఆర్‌అండ్‌బీ అధికారులను పంపించి పెనాల్టీ కట్టాలని నోటీసులు పంపించారన్నారు. భారత్‌మాల కోసం దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని, ధర నిర్ణయించి తిరిగి నోటిఫికేషన్‌ వేసి భూములు తీసుకోవాలని కోరారు. (క్లిక్‌: టీఆర్‌ఎస్‌కు రాజయ్య గుడ్‌బై)

మరిన్ని వార్తలు