Regional Ring Road: భూసేకరణ వేగవంతం.. 14 మండలాల్లో వేలాది ఎకరాల...

9 Sep, 2022 10:05 IST|Sakshi
‘రీజినల్‌ రింగు రోడ్డు’ ఉత్తర భాగం మ్యాప్‌  

ట్రిపుల్‌ ఆర్‌ నోటిఫికేషన్‌ విడుదలతో మొదలైన సర్వే

అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు 

ఉమ్మడి జిల్లాలోని 14 మండలాల్లో వేలాది ఎకరాల సేకరణ  

సాక్షి, గజ్వేల్‌: నోటిఫికేషన్‌ అధికారికంగా విడుదల కావడంతో ట్రిపుల్‌ఆర్‌ భూసేకరణ ప్రక్రియ జోరందుకుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఈరోడ్డు 110 కిలోమీటర్ల పొడవున విస్తరించే అవకాశమున్నందున.. దీని కోసం 14 మండలాల్లో 73కుపైగా గ్రామాల్లో వేలాది ఎకరాల్లో భూసేకరణ జరగనుంది. ఈక్రమంలో సర్వే పనులను ప్రారంభించారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్, చిట్యాల నుంచి భువనగిరి– గజ్వేల్‌ మీదుగా సంగారెడ్డి (కంది) వరకు 65వ నంబరు జాతీయ రహదారిని తాకుతూ 164కి.మీ మేర రహదారి విస్తరించనుంది. 
కంది–శంకర్‌పల్లి–చేవేళ్ల–షాద్‌నగర్‌–కడ్తాల్‌–యాచారం నుంచి (186 కిలోమీటర్లు) తిరిగి చౌటుప్పల్‌ను తాకనుందని ప్రాథమిక సమాచారం.  
ఈ లెక్కన మొత్తంగా 350 కిలోమీటర్ల పొడవునా రీజినల్‌ రింగు రోడ్డుగా మారనుంది. ఇందులో మొదటి విడతగా ఉత్తర భాగంలో చౌటుప్పుల్‌ నుంచి సంగారెడ్డి వరకు సుమారు 160 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్న విషయం తెలిసిందే.  

కాగా ట్రిపుల్‌ఆర్‌ వెళ్లే గ్రామాల జాబితాతో కేంద్రం ఇప్పటికే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా.. ఉత్తర భాగంలో 20 మండలాలు, వీటి పరిధిలోని 111 గ్రామాలు ఉన్నాయి.  
ఇందులో భాగంగానే యాదాద్రి–భువనగిరి జిల్లాలో యాదాద్రి, భువనగిరి, తుర్కపల్లి, వలిగొండ, చౌటుప్పల్‌ మండలాల పరిధిలో 33 గ్రామాలు ఉన్నాయి.  
ప్రత్యేకించి ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని 14 మండలాల్లో గల 73కి పైగా గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. ఉమ్మడి జిల్లా (సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌) పరిధిలో 110 కిలోమీటర్లపైనే విస్తరించనుంది.  
జగదేవ్‌పూర్‌–గజ్వేల్‌–తూప్రాన్‌–నర్సాపూర్‌–సంగారెడ్డి మీదుగా కంది వరకు ఈ రోడ్డు విస్తరించనుంది. గ్రామాలు, పట్టణాలు, పాత రోడ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూసేకరణ పూర్తి చేసి పనులు చేపట్టనున్నారు.  

సర్వే పనులు షురూ.. 
భూసేకరణ జరుగనున్న ఉత్తర భాగంలోని చాలా గ్రామాల్లో ఇప్పటికే పలుమార్లు డిజిటల్‌ సర్వే చేపట్టారు. ప్రస్తుతం సర్వే నంబర్ల వారీగా ప్రత్యక్ష సర్వే చేపడుతున్నారు.  
ఈ క్రమంలోనే జగదేవ్‌పూర్‌ మండలం పీర్లపల్లి గ్రామంలో సర్వే జరిపిన సందర్భంలో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.  
గ్రామంలోని 191 సర్వే నంబర్‌లో 250 ఎకరాల భూమిని ఎన్నో ఏళ్ల కిందట 150 మంది ఎస్సీలు, బీసీలకు అసైన్‌ చేశారు. అప్పటి నుంచి వీరంతా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.  
ఐదేళ్ల క్రితం ఇవే భూముల్లో కంపెనీలు ఏర్పాటు చేస్తామని వీరికి ధరణి వచ్చిన తర్వాత కొత్త పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు ఇవ్వలేదు.  

ఈ క్రమంలోనే ఈ భూముల్లో 120 ఎకరాల మేర ట్రిపుల్‌ఆర్‌ నిర్మాణానికి సేకరిస్తుండగా.. తమకు ఎలాంటి సమాచారమివ్వకుండా, సర్వే చేపట్టారని ఆరోపిస్తూ సర్వేను అడ్డుకున్న సంగతి విదితమే.  
దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి, సదరు రైతులకు న్యాయం చేసేలా నష్ట పరిహారం కో సం ప్రతిపాదనలు తయారు చేయాల్సి ఉంది.  
ఇక్కడే కాకుండా ఇలాంటి సమస్యలు చాలా చోట్ల ఉన్నాయి. దీని కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగితేనే భూసేకరణకు అడ్డంకులు ఏర్పడవు.   
ఇకపోతే గజ్వేల్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ట్రిపుల్‌ఆర్‌ కోసం మొత్తంగా 980 ఎకరాల భూసేకరణ చేపట్టడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు.  
తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి ప్రాంతాల్లోనూ భూసేకరణ ప్రక్రియ వేగవంతమవుతోంది. మొత్తంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వే లాది ఎకరాల భూసేకరణ జరగనుండగా, రెవె న్యూ యంత్రాంగం పనిలో నిమగ్నమై ఉంది. 

వారి సమస్యను పరిష్కరిస్తాం 
మా డివిజన్‌ పరిధిలో ట్రిపుల్‌ఆర్‌ భూసేకరణకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశాం. ఇప్పటికే సర్వే పనులు మొదలయ్యాయి. జగదేవ్‌పూర్‌ మండలం పీర్లపల్లి రైతులు తమకు న్యాయం చేయాలని సర్వేను అడ్డుకున్నారు. వారి సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాం.  
– విజయేందర్‌రెడ్డి, గజ్వేల్‌ ఆర్డీఓ 

మరిన్ని వార్తలు