బాంబ్‌ సేఫ్టీ రూంలో తలదాచుకున్నాం 

9 Oct, 2023 04:27 IST|Sakshi

‘హమాస్‌’దాడులతో భయంభయంగా తెలంగాణ వలసకార్మికులు 

ఇజ్రాయెల్‌లో 1,500 మందికిపైగానే... 

పాలస్తీనా సరిహద్దులో ఉన్నవారిలో టెన్షన్‌ టెన్షన్‌

సాక్షి ప్రతినిధి కరీంనగర్‌/మోర్తాడ్‌/ఆర్మూర్‌: ఇజ్రాయెల్‌లో ఉన్న తెలంగాణ వలస కార్మికుల కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పాలస్తీనా సరిహద్దుకు సమీప ప్రాంతంలో నివసిస్తున్నవారు ఇబ్బందులు పడుతుండగా, టెల్‌ అవీవ్‌ వంటి నగరాల్లో ఉన్నవారు క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. ఉమ్మడి ఏపీ నుంచి ఐదువేల మంది వరకు ఇజ్రాయెల్‌కు వలస వెళ్లారు. వీరిలో నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, మెదక్, జగిత్యాల తదితర జిల్లాలకు చెందిన సుమారు 1,500 మంది ఉన్నారు. విజిట్‌ వీసాలపై ఇజ్రాయెల్‌ వెళ్లిన చాలామంది అక్కడ ఇళ్లలో కార్మికులుగా పనులు చేస్తున్నారు.

ఇజ్రాయెల్‌లోని రమద్‌గాన్‌ పట్టణం తలవిల ప్రాంతంలో చాలామంది తెలంగాణవారు ఉన్నారు. ఈ పట్టణం పాలస్తీనా సరిహద్దుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. శనివారం సాయంత్రం నుంచి బాంబుల మోతతో ఈ ప్రాంతం దద్దరిల్లుతోందని తెలంగాణవాసులు ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం సెలవు ప్రకటించిందని, ప్రభుత్వం బాంబుల దాడి సమయంలో సైరన్‌ మోగించడంతో వెంటనే ప్రతి అపార్ట్‌మెంట్‌లో ఉండే బాంబ్‌ సేఫ్టీ రూంలో తలదాచుకున్నామని చెప్పారు.

తెలంగాణవాసులు కార్మికులుగా పనిచేసే ప్రాంతంలో శనివారం సాయంత్రం జరిగిన బాంబుదాడిలో ఓ భవనం ఆరో అంతస్తు శిథిలమైందని, ఇప్పటివరకు అందరం క్షేమంగానే ఉన్నామని తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన జగిత్యాల రూరల్‌ మండలం సంగంపల్లికి చెందిన జలపతిరెడ్డి, గుండ సత్తయ్య, అనంతరెడ్డి, హబ్సీపూర్‌కు చెందిన ఏలేటి మల్లారెడ్డి, గుగ్గిల్ల లక్ష్మీనారాయణ, వరికోల నర్సయ్య, ఆదివారం రాత్రి అక్కడి పరిస్థితులను ‘సాక్షి’కి వివరించారు.  

టెల్‌అవీవ్‌లో సురక్షితం 
తెలంగాణకు చెందిన 600 మంది వలస కార్మికులు ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ నగరంలో ఉపాధి పొందుతున్నారు. హమాస్‌ దాడులతో సరిహద్దు ప్రాంతాల్లోని వారికే ఎక్కువ ముప్పు ఉందని, ఇతర ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది లేదని నిజామాబాద్‌ జిల్లానుంచి ఇజ్రాయెల్‌కు వలస వెళ్లిన కార్మికులు ‘సాక్షి’కి ఫోన్‌ ద్వారా తెలిపారు. దాడులు మొదలైనప్పుడు కొంత ఆందోళనకు గురయ్యామని, మిలిటెంట్ల ఆగడాలను అరికట్టడానికి ఇజ్రాయెల్‌ రక్షణ విభాగం రంగంలోకి దిగి సరిహద్దు ప్రాంతాల్లోనే నిలువరించాయని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నామన్నారు.  

రక్షణ చర్యలు చేపట్టారు
ఇజ్రాయెల్‌ ప్రభుత్వం పౌరుల రక్షణకు చర్యలు చేపట్టింది. దాడులు జరుగుతున్న ప్రాంతం మా నివాస ప్రాంతాలకు దూరంగా ఉండడం వల్ల తెలంగాణవారు పెద్దగా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు.  – సోమ రవి, తెలంగాణ ఇజ్రాయెల్‌  అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు 

ఉపాధిపై ప్రభావం ఉంటుంది 
కుటుంబాలను పోషించుకోవడానికి కోసం ఇక్కడకు వలస వచ్చాం. కోవిడ్‌ సమయంలో పనులు లేక ఇబ్బందిపడ్డాం. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయంగా ఉంది.  – ఓంకార్, ఇజ్రాయెల్‌లో ఉన్న ఆర్మూర్‌ మండలం పిప్రివాసి 

మరిన్ని వార్తలు