జనగామ బరిలో నేనే ఉంటా

9 Oct, 2023 04:25 IST|Sakshi
ముత్తిరెడ్డిని అభినందిస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 

జనగామ: తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినా.. జనగామలో బీఆర్‌ఎస్‌ తరపున బరిలో తానే ఉంటానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడానికి కుటుంబసభ్యులు, బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి హైదరాబాద్‌ వెళ్లిన ముత్తిరెడ్డి.. కార్యక్రమం అనంతరం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌ నిర్ణయమే శిరోధార్యమని, ఆ మేరకే ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. అంతకుముందు ఆయన హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్య త లు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవుళ్ల చిత్రపటాల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఫైల్‌పై తొలి సంతకం చేశారు. సీఎం కేసీఆర్‌ తనపై నమ్మకం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంస్థ పురోగతికి కృషి చేస్తానన్నారు.

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సజ్జనార్‌ ఎండీగా ఉంటూ సంస్థను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారని, తాను కూడా సంస్థ ఉద్యోగుల్లో ఒకడిగా వ్యవహరిస్తూ సంస్థ బాగుకు యత్నిస్తానని తెలిపారు. అనంతరం ఎండీ సజ్జనార్‌ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు