అభినవ చాణక్యుడు సీఎం కేసీఆర్‌: ఆక్స్‌ఫర్స్‌ యూనివర్సిటిలో కవిత

31 Oct, 2023 09:26 IST|Sakshi

దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్

అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించిన గాంధీ సీఎం కేసీఆర్

మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం సీఎం కెసిఆర్‌కు రెండు కళ్ళ లాంటివి

నా తెలంగాణ కోటి రతనాల వీణ , నేడు కోటి ఎకరాల మాగాణి 

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్‌పై కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం

సాక్షి, హైదరాబాద్‌: భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు. పరిపాలనలో మానవీయ కోణాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ అభినవ చాణక్యగా అభివర్ణించారు. అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన గాంధీ సీఎం కేసిఆర్ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి సీఎం కేసిఆర్ స్పూర్తినిచ్చారన్నారు.

ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందుందని అన్నారు. తెలంగాణ శాంతిసామరస్యానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక గణాంకాలు కాదని.. అది మారిన తెలంగాణ జీవన స్థితిగతులని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకెళ్తోందని, అన్ని రంగాల్లో తెలంగాణను సీఎం కేసీఆర్ అగ్రగామిగా నిలిపారని వివరించారు. 

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష 
కేసీఆర్ తో సఫలం అయ్యిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం సాగిందని, చివరికి 2001లో సీఎం కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించారని తెలిపారు. దాంతో 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో చేర్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత కేసీఆర్ ఉద్యమాన్ని ఉదృతం చేయడంతో 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, చివరికి 2014లో ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యిందని వివరించారు.

ధాన్యం ఉత్పత్తిలో రెండో స్థానం
అయితే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోన్న 10 జిల్లాల్లో 9 వెనుకబడిన జిల్లాలు ఉండేవని, రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండేదని ప్రస్తావించారు. 2700 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేదని, విద్యుత్తు లేక పరిశ్రమలను వారంలో రెండు రోజులపాటు మూసివేసేవారని, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సమూలమైన సంస్కరణల ద్వారా పూర్తిగా ఆ పరిస్థితులను మార్చివేశారని స్పష్టం చేశారు. విద్యుత్తు మిగులు సాధించామని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానానికి చేరిందని అన్నారు.
చదవండి: Telangana: ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నా కూడా అసెంబ్లీకే జై

2014-15నుంచి 2022-23 మధ్యకాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)118.2 శాతం పెరగగా.. తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)155.7 శాతం పెరిగిందని తెలిపారు. అంటే జాతీయ సగటుకు మించి తెలంగాణ పయనిస్తోందని చెప్పారు. జీఎస్డీపీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు అయ్యే సమయానికి రూ. 1,12,162 ఉన్న తలసరి ఆదాయం 2022-23 నాటికి రూ. 3,14,732కి పెరిగిందని, తలసరి ఆదాయం పెరుగుదలలో ఇతర రాష్ట్రాలకు మించి దూసుకెళ్తొందని తెలిపారు.అందరికి సమాన సందప విధానాన్ని సీఎం కేసీఆర్ అవలంభిస్తున్నారన్నది అర్థమవుతోందని వివరించారు.

సమానాదాయ పంపిణీలో తెలంగాణ నెంబర్ వన్‌
ఎన్ఎఫ్ హెచ్ఎస్ 2019-21 ప్రకారం సమానాదాయ పంపిణీలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని ప్రస్తావించారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెగటివ్ వృద్ధిలో ఉన్న తెలంగాణ 2022-23 నాటికి 15.7 శాతం వృద్ధి సాధించిందని వెల్లడించారు. చివరి గింజ వరకు ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తోందని, రైతు బంధు పేరిట ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతులకు రూ.72815కోట్లు అందించామని చెప్పారు. ఈ చర్య వల్ల రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేసే పరిస్థితి పోయిందని అన్నారు. ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని, రైతాంగానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నమనా వివరించారు.

పండగలా వ్యవసాయం
తెలంగాణ వ్యవసాయం పండగలా మారిందని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా భూరికార్డులను కంప్యూటరీకరణ చేపట్టి విప్లవాత్మక మార్పుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. 99 శాతం భూరికార్డులు భద్రంగా ఉన్నాయని తద్వారా అవసరమైన రుణాలను కూడా బ్యాంకులు ఇస్తున్నాయని చెప్పారు. మిషన్ కాకతీయ కింద చెరువులు మరమ్మత్తు చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో చెరువులు నిండుకుండాలా ఉన్నాయని, దానితో భూగర్భజలాలు పెరగడమే కాకుండా మత్స్య సంపద పెరిగిందని వివరించారు.

మూడున్నరేళ్ల కాలంలోనే కాళేశ్వరం పూర్తి
రికార్డుస్థాయిలో మూడున్నరేళ్ల కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని పునరుద్ఘాటించారు. ఆ ప్రాజెక్టు వల్ల రైతులు మూడు పంటలు పండిస్తున్నారన్నారు. 2004-2014 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వాలు వ్యవసాయానికి రూ. 7994 కోట్లు ఖర్చు చేస్తే గత తొమ్మిదిన్నరేళ్లకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1,91,612 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. బలమైన విధానాలు రూపొందించడం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయన్నారు. సాగు విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాల నుంచి 2 కోట్లకుపైగా ఎకరాలకు పెరిగిందని, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని వివరించారు.

తాగునీటిపై రూ.36 వేల కోట్లు ఖర్చు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే మరో 50 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని అన్నారు. 2014లో రూ. 62లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు రూ. 2 లక్షల 94 వేల కోట్లకు చేరుకుందని గుర్తు చేశారు. తాగునీటిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.36 వేల కోట్లు ఖర్చు చేసిందని, మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ కల్పించామని చెప్పారు. విద్యుత్తు రంగంలో రూ.38 వేల కోట్లు ఖర్చు చేశామని, 2014లో 7778 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తయ్యేదని, ఇప్పుడు 18453 మెగావాట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకున్నామన్నారు.

హరితహారం కోసం రూ.10 వేల కోట్లు
పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలోనూ తెలంగాణ ఎంతో ముందుందని పేర్కొన్నారు. తలసరి విద్యుత్తు వినియోగం 2126 యూనిట్లకు చేరిందని, ఇది దేశంలోనే అత్యధికమని ప్రస్తావించారు. కాగా, పర్యావరణ సవాళ్లను అధిగమించడానికి 280 కోట్ల మొక్కలు నాటామని, అందుకు తెలంగాణకు హరితహారం కింద రూ.10 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. ప్రతీ గ్రామంలో నర్సరీని నెలకొల్పామని, ప్రపంచంలో ఈ విధానం ఎక్కడా లేదని స్పష్టం చేశారు.

కోట్లలో ఐటీ ఉత్పత్తుల ఎగుమతి 
పరిశ్రమల ఏర్పాటును వేగవంతంగా అనుమతులు ఇస్తున్నామని, టీఎస్ ఐపాస్ విధానం ద్వారా కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని. ఆలోగా అనుమతులు రాకపోతే పరిశ్రమను స్థాపించుకునే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని వివరించారు. 2014 నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.3.31 లక్షల కోట్ల పెట్టుబడులతో 22100 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, తద్వారా 22 లక్షల 36 వేల పరోక్ష ఉద్యోగాలను సృష్టించామని, 2014లో రాష్ట్రం నుంచిరూ. 57 వేల కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతవ్వగా.. ఇప్పుడు రూ.1.83 లక్షల విలువైన ఎగుమతులుకు చేరామని వివరించారు.

వైద్య రంగంలో ఎంతో పురోగతి
యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ వంటి బహుళజాతి కంపెనీలు సైతం తమ యూనిట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఇంత వృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే, వైద్య రంగంలో తెలంగాణ ఎంతో పురోగమించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, సీఎం కేసీఆర్ ఇప్పుడు 104కేంద్రాలకు పెంచారన్నారు.

మహిళా సాధికారతకు కృషి
రూ. 11 వేల కోట్లకుపైగా ఆసరా పథకం కింద 44 లక్షల మందికిపైగా పెన్షన్లు అందించామని అన్నారు. విద్యారంగంలో రంగంలో సమూల మార్పలు తీసుకొచ్చామని, 10 వేల మెడికల్ సీట్లను పెంచామని, ప్రతీ జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల వారి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారతకు ఎంతో కృషి చేస్తున్నమన్నారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిది
మహిళా రిజర్వేషన్ల చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కు అని పార్లమెంటు ఆమోదించిన తర్వాత కూడా మా రిజర్వేషన్ల చట్టం అమలు కావడం లేదని కల్వకుంట్ల కవిత ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించిందని అన్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల నుంచే చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్లు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, అన్ని పార్టీలు డిమాండ్ చేసినా ఓబీసీ కోటా కూడా కల్పించలేదని తప్పుబట్టారు.

మరిన్ని వార్తలు