Bolarum : రాష్ట్రపతి నిలయంలో మరిన్ని పర్యాటక హంగులు

22 Dec, 2023 04:21 IST|Sakshi

ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 

1948 నాటి చారిత్రక ఫ్లాగ్‌ పోస్ట్‌ ప్రతిరూపం ఆవిష్కరణ 

సాక్షి, హైదరాబాద్‌: శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం రాష్ట్రపతి నిలయం ఆవరణలో పలు పర్యాటకాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధానంగా 1948 నాటి ఫ్లాగ్‌ పోస్ట్‌ ప్రతిరూపాన్ని ఆవిష్కరించారు. 1948లో హైదరాబాద్‌ రాష్ట్రం భారత్‌లో విలీనమైన సందర్భంగా ఇక్కడ నిర్వహించిన వేడుకల్లో ప్రిన్స్‌ ఆజం షా నుంచి హైదరాబాద్‌ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వం నియమించిన ఎంకే వెల్లోడి బాధ్యతలు స్వీకరిస్తూ హైదరాబాద్‌ జెండా స్థానంలో జాతీయ జెండాతో కూడిన ఫ్లాగ్‌ పోస్ట్‌ను ఆవిష్కరించారు.

అయితే కాలక్రమేణా ఆ ఫ్లాగ్‌పోస్ట్‌ పాడవడంతో 2010లో దాన్ని తొలగించారు. తాజాగా అందుకు ప్రతిరూపంగా నూతనంగా టేకుతో ఏర్పాటు చేసిన ఫ్లాగ్‌ పోస్ట్‌ను రాష్ట్రపతి గురువారం ప్రారంభించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మ్యూజికల్‌ ఫౌంటేన్, చిల్డ్రన్స్‌ పార్క్, పునరుద్ధరించిన మూడు మెట్ల బావులతోపాటు సంప్రదాయ మోట పద్ధతి ద్వారా నీటిని తోడే వ్యవస్థను సైతం ప్రారంభించారు.

అలాగే రాతిపై చెక్కిన శివుడు, నంది శిల్పాల నుంచి నీళ్లు జాలువారే వ్యవస్థను రాష్ట్రపతి ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లుఅధికారులు తెలిపారు.  

>
మరిన్ని వార్తలు