తెలంగాణ మున్సిపల్‌శాఖ కీలక ఉత్తర్వులు

10 Dec, 2021 19:05 IST|Sakshi

సాక్షి హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ కొరడా ఝుళిపించింది. హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అనుమతి పేరుతో హెచ్‌ఎండీఏ అనుమతులు లేకుండా అక్రమంగా భారీ భవనాల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అక్రమ లే అవుట్‌లు, అక్రమ నిర్మాణాలు కూల్చివేతలను ఆదేశించింది. సాధారణంగా హెచ్‌ఎండీఏ పరిధిలో గ్రామ పంచాయతీలు జీ ప్లస్ 2 వరకు మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. - అంతకు మించి భారీ నిర్మాణాలు,  అనుమతి లేని విల్లాలను  కూల్చి వేయాలని ఆదేశించింది.

కాగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాలాలపై ఆక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.  ప్రతి మంగళవారం నాళాల అభివృద్ధి పై సమీక్ష చేయనున్నట్లు తెలిపారు.  వారానికి ఒకసారి క్షేత్ర స్థాయిలో నాలలను పరిశీలన చేయనున్నట్లు వెల్లడించారు.  నాళాలపై నిర్మణాల కూల్చివేతల బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయించాలని నిర్ణయించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: నయా మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై నజర్‌

మరిన్ని వార్తలు