హాట్‌హాట్‌గా ఓటు వేట

6 Apr, 2021 02:24 IST|Sakshi

ఎండలను లెక్క చేయకుండా ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాన పార్టీలు

గెలుపే ధ్యేయంగా ప్రజల్లోకి.... మంత్రి జగదీశ్‌రెడ్డి భుజాలపై టీఆర్‌ఎస్‌ బాధ్యతలు

జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి గ్రామాలను చుట్టేస్తున్న మంత్రి

రోడ్‌షోకు సిద్ధమవుతున్న మంత్రి కేటీఆర్‌... మళ్లీ కేసీఆర్‌తో బహిరంగ సభ!

నియోజకవర్గానికి తరలిన టీపీసీసీ నాయకత్వం... జానాకు తోడుగా

గ్రామాల్లోకివినూత్నంగా బీజేపీ అభ్యర్థి ప్రచారం... 10 తర్వాత సాగర్‌కు సంజయ్

‌మూడు ప్రధాన పక్షాల మధ్యనే పోటాపోటీ... మిగిలింది ఇక పది రోజులే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతోంది. ఓవైపు మండుటెండలు అదరగొడుతున్నా రాజకీయ పార్టీలు ప్రచారంలో భాగంగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నాయి. గెలుపే ధ్యేయంగా తెల్లారిన దగ్గరి నుంచి చీకటి పడేంతవరకు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రచారపర్వంలో అధికార టీఆర్‌ఎస్‌ ఒకింత ముందంజలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీలు కూడా శక్తిమేరకు ప్రయత్నం చేస్తున్నాయి. సాగర్‌లో పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి తన టీంతో కలిసి విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి, ఆయన తనయులకు తోడు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం కూడా జట్టుగా గ్రామాల్లోకి వెళ్లి ప్రచారంలో ఎక్కడా వెనుకబడకుండా చూసుకుంటుండగా, బీజేపీ అభ్యర్థి రవినాయక్‌ స్థానిక నేతలతో కలిసి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ రెండ్రోజుల రోడ్‌షోకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, సీఎం కేసీఆర్‌తో మరోమారు బహిరంగ సభ కూడా నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ కూడా జనగర్జన తరహాలోనే మరోమారు బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈనెల 10 తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా సాగర్‌కు వెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు. దీంతో మరో పది రోజులు గడువు ఉన్నా... ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కనుంది. 

14న నిడమనూరులో సీఎం సభ!
నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ విజయం కోసం ఆ పార్టీ శ్రేణులు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నాయి. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి.. భగత్‌ గెలుపు బాధ్యతలను తీసుకొని గ్రామాలను కలియ తిరుగుతున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌ కూడా నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రతి రోజు గ్రామాలకు వెళ్లి కేసీఆర్‌ పాలనను మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఇప్పటికే మండలాల వారీగా ఇన్‌ఛార్జిలుగా నియమితులైన బయటి జిల్లాల ఎమ్మెల్యేలు తమకు అప్పగించిన టీంలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు.

ఒకటీ రెండు రోజుల్లో ఐటీ మంత్రి కేటీఆర్‌ కూడా నియోజకవర్గంలో రోడ్‌ షో నిర్వహిస్తారనే ప్రచారం సాగర్‌ గులాబీ దండును ఉరకలు పెట్టిస్తోంది. దీంతోపాటు ముఖ్యమంతి కేసీఆర్‌ మరోమారు నియోజకవర్గంలో బహిరంగసభకు హాజరవుతారని, ఈ నెల 14న ఆయన నిడమనూరులో జరిగే సభలో పాల్గొంటారని తెలంగాణ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంమీద సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఎండలను సైతం ఖాతరు చేయని, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు భగత్‌ విజయం కోసం పట్టు వదలకుండా పని చేస్తున్నారు.

టార్గెట్‌ జానా
జానారెడ్డినే టార్గెట్‌ చేసి టీఆర్‌ఎస్‌ తమ ప్రచారం నిర్వహిస్తోంది. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎలాంటి అభివృద్ధి జరుగలేదని, తెలంగాణ వచ్చాకే సాగర్‌ ఆయకట్టు చివరి భూములకు నీళ్లు ఇవ్వగలిగామని చెబుతోంది. జానారెడ్డి అనేక శాఖలకు మంత్రిగా పని చేసినా నియోజకవవర్గ ప్రజలను ఉద్దరించిందేమీ లేదని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉపయోగం లేదంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు గులాబీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌కు దీటుగా ప్రచారంలో కాంగ్రెస్‌
పార్టీ అభ్యర్థి జానారెడ్డి వ్యక్తిగత చరిష్మాపైనే ఆధారపడి ఉప ఎన్నికను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రచారంలో టీఆర్‌ఎస్‌కు తీసిపోకుండా దూసుకెళ్తోంది. జానారెడ్డితో పాటు ఆయన తనయులు రఘువీర్, జయవీర్‌లు విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్‌ తదితరులు నియోజకవర్గంలోనే ఉండి ఓటర్లను కలుస్తున్నారు. జానారెడ్డి అభివృద్ధి చేయలేదన్న టీఆర్‌ఎస్‌ విమర్శలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.

జానారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నపుడే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో ఒరిగిందేమీలేదని ఓటర్లకు చెప్పి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మండలాల వారీగా మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఇన్‌ఛార్జీలుగా నియమించిన కాంగ్రెస్‌ పార్టీ మరోసారి బహిరంగ సభను నిర్వహించే యోచనలో ఉంది. అయితే సీఎం కేసీఆర్‌ సభ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిని బట్టి కాంగ్రెస్‌ సభ నిర్వహించాలా? వద్దా..? అన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీలు కోమటిరెడి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిలు కూడా జానా ప్రచారానికి తోడు కానున్నారు. పార్టీకి చెందిన అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, మాజీ నాయకులు సాగర్‌లోనే ఉండి జానా గెలుపు బాధ్యతలను భుజానవేసుకున్నారు.

సర్దిచెప్పుకొని సమన్వయంతో ముందుకెళ్తున్న బీజేపీ
నియోజకవర్గంలో గతంలో పోటీ చేసిన అభ్యర్థిని కాదని కొత్త వ్యక్తి డాక్టర్‌ రవి నాయక్‌కు టికెట్‌ ఇవ్వడంపై మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తమైనా క్షేత్ర స్థాయి నాయకత్వానికి సర్ది చెప్పుకోవడంలో బీజేపీ సఫలీకృతమైంది. ప్రస్తుతానికి స్థానిక నేతలలో కలిసి రవికుమార్‌ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల పార్టీలకు పోటీ ఇచ్చేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, టికెట్‌ ఆశించిన నివేదితా రెడ్డి కూడా తాజాగా ప్రచారంలో కలిసి వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన స్వగ్రామం పలుగుతండాకు వెళ్లిన సందర్భంగా విలపించి వార్తల్లోకెక్కిన రవికుమార్‌ ఆ తరువాతి రోజున రూటు మార్చి డాన్స్‌లు చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

ఇప్పటికే పార్టీలోని రాష్ట్ర స్థాయి, ద్వితీయ శ్రేణి నేతలను సాగర్‌లో ప్రచారానికి పంపించిన బీజేపీ ముఖ్యనేతలను రంగంలోకి దింపేందుకు చర్యలు చేపట్టింది. రవికుమార్‌ ఎన్నికల ప్రచారానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నిజమాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ తదితరులు తరలిరానున్నారు. ఈ మేరకు పార్టీ నాయకత్వం ప్రచార షెడ్యూలు ఖరారు చేస్తోంది. ఈనెల 10వ తేదీ తరువాత బండి సంజయ్‌ సాగర్‌లో మకాం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వారితోపాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలను కూడా సాగర్‌కు తీసుకురావాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. మరో 38 మంది కూడా బరిలో ఉన్నా ప్రధాన పోటీ ఈ మూడు పార్టీల మధ్యే నెలకొంది.

చదవండి:6 ఎమ్మెల్సీలు ఖాళీ.. కడియంకు మళ్లీ ఛాన్స్‌ ఉండేనా? 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు