దారుణం: 'నన్ను కాదన్న అమ్మాయిని పెళ్లిచేసుకుంటావా'

6 Apr, 2021 02:23 IST|Sakshi

తమ్ముడిని చంపిన అన్న

తనను కాదన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని కక్ష 

సాక్షి, అచ్యుతాపురం: తనను కాదన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనే కక్షతో తోడబుట్టిన తమ్ముడిని ఓ అన్న కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం జాలరిపాలెంలో జరిగింది. వివరాలు.. పూడిమడక శివారు జాలరిపాలేనికి చెందిన మడ్డు పోలమ్మ పెద్ద కుమారుడు రాజుకు పెళ్లి చేయడానికి ఇటీవల భీమిలికి చెందిన అమ్మాయిని చూశారు. కానీ ఆ అమ్మాయి పోలమ్మ చిన్న కుమారుడు యర్లయ్య(21)ను చేసుకుంటానని చెప్పింది. దీంతో పోలమ్మ ఆ సంబంధాన్ని యర్లయ్యకు ఖాయం చేసింది. రాజుకు మరో సంబంధం చూస్తానని నచ్చచెప్పింది. మే నెలలో పెళ్లి చేయడానికి ముహూర్తాలు పెట్టుకున్నారు.

యర్లయ్య పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండడంతో రాజు అసహనానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో సోమవారం యర్లయ్య ఫోన్‌ కొనుక్కుంటానని తల్లి పోలమ్మను డబ్బులడిగాడు. ఆమె రూ.2 వేలు ఇవ్వగా.. అవి సరిపోవని రూ.4వేలు కావాలంటూ తల్లితో గొడవ పడ్డాడు. ఇంతలో యర్లయ్యను అడ్డుకున్న రాజు.. వలను అల్లడానికి ఉపయోగించే ఒరుగు అని పిలిచే కత్తిని అమాంతం తమ్ముడి గొంతులో దించాడు. వెంటనే అక్కడ్నుంచి పారిపోయాడు. యర్లయ్యను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ జరిపారు. నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. తనను కాదన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనే కక్షతోనే తమ్ముడిని హత్య చేసినట్లు రాజు అంగీకరించాడని సీఐ నారాయణరావు, ఎస్‌ఐ లక్ష్మణరావు వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు