మనోనిబ్బరం కోల్పోతున్న పురుషులు

7 Dec, 2023 07:20 IST|Sakshi

హైదరాబాద్: నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)– 2022 గణాంకాలు ఓ కీలక విషయాన్ని బయటపెట్టాయి. నగరంలో గతేడాది నమోదైన ఆత్మహత్య కేసుల్లో మహిళల కంటే పురుషులవే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాయి. బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో పాటు మనోనిబ్బరం విషయంలో స్త్రీల కంటే పురుషులే బలహీనంగా ఉండటం దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

2022లో నగరంలో మొత్తం 544 ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. ఈ మృతుల్లో పురుషులు 433 మంది కాగా... మహిళలు 111 మంది ఉన్నట్లు మంగళవారం విడుదలైన ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆత్మహత్యల సంఖ్యలో దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్‌ పదో స్థానంలో ఉంది. అన్నింటా స్త్రీలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించే పురుషులు కష్ట,నష్టాలు ఎదుర్కోవడంలో మాత్రం డీలాపడిపోతున్నారు. నిరాశ, నిస్పృహలతో అర్ధాంతరంగా జీవితాలు ముగించడానికే మొగ్గు చూపుతున్నారు.

అనేక సమస్యలతో..
► గత ఏడాది దేశ వ్యాప్తంగా 1,70,924 ఆత్మహత్యలు రికార్డుల్లోకెక్కగా.. వీటిలో 9,980 రాష్ట్రానికి సంబంధించినవే. మెట్రో నగరాలతో పోలిస్తే ప్రథమ స్థానంలో ఢిల్లీ (3367), ద్వితీయ స్థానంలో బెంగళూరు (2313) ఉండగా.. 1004 కేసులతో తర్వాత స్థానం సూరత్‌ది. సిటీలో జరిగిన ఆత్మహత్య మృతుల్లో పురుషులు 544 మంది ఉండగా... సీ్త్రలు 111 మంది ఉన్నారు. అంటే మహిళల కంటే పురుషులు కొన్ని రెట్ల సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ బలవన్మరణాలకు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు దోహదం చేస్తున్నాయని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా బలవన్మరణాలకు పాల్పడటానికి కుటుంబ కలహాలే ఎక్కువగా కారణం అవుతున్నాయి.

► నగరంలో గత ఏడాది జరిగిన ఆత్మహత్యల్లో 20.5 శాతం అప్పులు, బ్యాంకు రుణాలు తీర్చలేకపోవడం వంటి కారణాల వల్లే జరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా జరిగిన ఆత్మహత్యల్లో ఉన్న ముగ్గురు మృతులూ పురుషులే అని గణాంకాలు చెబుతున్నాయి. కుటుంబ కలహాలు కారణంగా ఆత్మహత్య చేసుకున్న 120 మందిలో 87 మంది పురుషులు ఉన్నారు. అనారోగ్య కారణాలతో 138 మంది సూసైడ్‌ చేసుకోగా వీరిలో మగవారు 100 మంది ఉన్నారు. సన్నిహితులు చనిపోయారనే కారణంతో ఏడుగురు పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలో ప్రేమ వ్యవహారాల వల్ల ఆత్మహత్య చేసుకున్న వారిలో మహిళల కంటే పురుషులు ఏడుగురు ఎక్కువ ఉన్నారు. నిరుద్యోగం కారణంగా చనిపోయిన 13 మంది పురుషులే కావడం గమనార్హం.

పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావు..
ఎన్‌సీఆర్‌బీ రాష్ట్ర పోలీసులు ఇచ్చే జాబితా ఆధారంగా నివేదిక రూపొందిస్తుంది. ఈ జాబితా ఠాణాలో నమోదయ్యే కేసుల ఆధారంగా తయారవుతాయి. ఆత్మహత్యల ఉదంతాలకు సంబంధించి అనేక కేసుల్లో అసలు కారణాలు వెలుగులోకి రావు. కొన్ని ఉదంతాలు అసలు పోలీసు రికార్డుల్లోకే ఎక్కవు. మహిళలు, యువతులకు సంబంధించి ఉదంతాల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు, విఫల ప్రేమలు, వివాహేతర సంబంధాల వల్ల జరిగిన ఉదంతాలు బయటకు రాకూడదనే కుటుంబీకులు ప్రయత్నిస్తారు. ఒకవేళ పోలీసుల వరకు వచ్చి అసలు కారణాలు బయటకు చెప్పరు. ఇలాంటి అనేక కారణాలు ఎన్సీఆర్బీ గణాంకాలపై ప్రభావం చూపిస్తుంటాయి.
– నగర పోలీసు ఉన్నతాధికారి

>
మరిన్ని వార్తలు