ప్రైవేటు సిబ్బందికి టీకాపై అస్పష్టత

19 Jan, 2021 08:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఎదురుచూస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల వైద్య సిబ్బంది

త్వరగా వేయాలంటూ ప్రభుత్వానికి విన్నపం 

6,305 ప్రైవేటు ఆస్పత్రుల్లో 1.90 లక్షలు నమోదు 

నిర్ణీత తేదీ ప్రకటించక పోవడంపై ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాల కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందో తెలియట్లేదు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణీత తేదీ ప్రకటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకాలు వేస్తున్నా రాష్ట్రంలో మాత్రం వేయకపోవడంపై ప్రైవేటు వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

తొలిరోజు 40 ఆస్పత్రుల్లో వేస్తామని...
దేశవ్యాప్తంగా కరోనా టీకాలను మొదట ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి ఉచితంగా వేయాలని నిర్ణయించారు. ఈ నెల 16న కరోనా వ్యాక్సినేషన్‌ మొదటి రోజు రాష్ట్రంలో 140 సెంటర్లలో టీకా వేయాలని నిర్ణయించగా, అందులో 40 ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఉన్నాయి. కానీ చివరకు ప్రైవేటు ఆస్పత్రులను పక్కనపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మొత్తం 140 టీకా సెంటర్లను ఏర్పాటు చేసి వాటిల్లోని సిబ్బందికే వ్యాక్సిన్‌ వేశారు. అలాగే సోమవారం 335 సెంటర్లలో వ్యాక్సినేషన్‌ జరిగినా వాటిల్లోనూ ప్రైవేటు ఆస్పత్రులు లేవు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  (చదవండి: ‘ఢోకా’లేని ‘టీకా’ ఇదే అయితే..?!)

1,120 ప్రభుత్వ... 6,305 ప్రైవేటులో
తెలంగాణలో వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 1,120 ప్రభుత్వ ఆసుపత్రులున్నాయి. 25 వేల మంది ఆశ కార్యకర్తలు, 10 వేల మంది ఏఎన్‌ఎంలు కలుపుకొని మొత్తం ప్రభుత్వ రంగంలో 1.40 లక్షల మంది సిబ్బందిని కరోనా టీకాల కోసం అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసింది. అలాగే 6,305 ప్రైవేటు ఆస్పత్రుల్లో 1.90 లక్షల మంది సిబ్బంది ఉన్నారని తేల్చింది. వారి పేర్లనూ కోవిన్‌ యాప్‌లో నమోదు చేసింది. రాష్ట్రంలో 1,213 ఆస్పత్రుల్లో టీకా కేంద్రాలు పెట్టాలని నిర్ణయించగా అందులో 179 ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఉన్నాయి. (చదవండి: వ్యాక్సినేషన్‌ తర్వాత ఇద్దరు మృతి!)

పక్కాగా టీకాల లెక్క
టీకాలను ప్రైవేటు యాజమాన్యాలకు ఇవ్వాలన్న నిబంధన లేదు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనే ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన సిబ్బందికీ వ్యాక్సినేషన్‌ జరగాల్సి ఉంది. కాబట్టి దుర్వినియోగం కాదని ప్రభుత్వమే స్పష్టం చేసింది. ఎందుకంటే టీకా వేశాక, మిగిలిన వ్యాక్సిన్లను అదే రోజు సాయంత్రానికి ప్రభుత్వ నిల్వ కేంద్రానికి తరలించాలన్న నిబంధన కూడా ఉంది. ఆ ప్రకారం ఎంతమందికి ఆ రోజు టీకా వేశారో కోవిన్‌ యాప్‌లో వివరాలను నమోదు చేయాలి. ప్రతి టీకాకు లెక్క చూపాల్సిందే. కాబట్టి వ్యాక్సిన్లు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుండగా, రెండో వారం నుంచి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ టీకా వేస్తామని అధికారులు చెబుతున్నారు.
 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు