మనోధైర్యమే మందు: ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌!

14 Dec, 2020 11:43 IST|Sakshi

పెద్ద వయస్సులో రికవరీ అయిన కరోనా యోధులు 

ఎస్‌కే అర్హ  ః 102 

ఆస్తమా, బీపీ ఉన్నా.. బయటపడ్డ 90 ఏళ్ల  లలితకుమారి 

వందేళ్లు, 90 ఏళ్లు దాటినా... కరోనాను జయించిన వారియర్స్‌ వీళ్లు. మనోధైర్యమే ఆయుధంగా కరోనాను ఎదుర్కొన్నారు. అదే అసలైన మందు అంటున్నారు. ఇతర అనారోగ్య సమస్యలున్నా... టెన్షన్‌ పడలేదు. ఆందోళన పడతారని కరోనా సోకిన విషయాన్ని పిల్లలకు కూడా చెప్పని నిబ్బరం ఉన్నవాళ్లు కొందరు. ప్రశాంతంగా ఉంటూ, డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకొని బయటపడ్డారు..

ఈయన పేరు శుభ్‌ కరణ్‌ అర్హ. 102 ఏళ్ల శుభ్‌కరణ్‌కు అక్టోబర్‌ 24వ తేదీన కరోనా సోకింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌ అధికారిగా కీలక పదవుల్లో పనిచేసి రిటైరైన సీడీ అర్హ తండ్రి. శతాధికుడైన తండ్రికి కరోనా రావడంతో సీడీ అర్హ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శుభ్‌కరణ్‌ అర్హకు షుగర్, బీపీ వంటివి లేవు. జ్వరం, తీవ్ర జలుబు ఉండటంతో హోం ఐసో లేషన్‌లోనే ఉంచి చికిత్స చేశారు. ఒకసారి శ్వాసకోశ సమస్య ఎదురైనా అంతటి వయస్సులోనూ ఆయన గట్టెక్కారు. నవంబర్‌ రెండో తేదీన పరీక్షిస్తే ఆయనకు కరోనా నెగెటివ్‌ వచ్చింది. కుటుంబసభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. 102 ఏళ్ల వయస్సులోనూ శుభ్‌కరణ్‌ అర్హ ప్రతిరోజూ ఉదయం ఒక కిలోమీటర్, సాయంత్రం ఒక కిలోమీటర్‌ వాకింగ్‌ చేస్తారు. శాకాహారి. మధ్యాహ్నం ఒక చపాతి, రాత్రి ఒక చపాతి తీసుకుంటారు. ఎక్కువగా పండ్లు, సలాడ్లు తింటారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రార్థనలు చేస్తారు. 

బీపీ, ఆస్తమా ఉంది... అయినా గట్టెక్కా  
ఆగస్టులో కరోనా వచి్చనట్లు తేలింది. ఎలాంటి లక్షణాలు లేవు. కిమ్స్‌కు వెళ్లాను. చెస్ట్‌ స్కాన్‌ చేశారు. అక్కడ పది రోజులు ఉన్నాను. నాకు బీపీ, ఆస్తమా ఉంది. అయినా త్వరగా కరోనా నుంచి బయటపడ్డాను. కరోనా వచ్చింది ఏం చేస్తాం... అనుకున్నానే కానీ టెన్షన్‌ పడలేదు. నా పిల్లలకు కూడా చెప్పలేదు. ఏం చేస్తుందిలే అని ధైర్యంగా ఉన్నాను. డాక్టర్లు చెప్పినట్లుగా మందులు వేసుకున్నాను. అంతే కోలుకున్నాను.  
– జి.లలితకుమారి (90), హైదరాబాద్, సీఆర్‌ఫౌండేషన్‌ వృద్ధాశ్రమం

బీపీ, షుగర్‌ ఉన్నా  భయపడలేదు.. 
నాకు కూడా ఆగస్టులోనే కరోనా సోకింది. వైరస్‌ లోడ్‌ అంతగా లేదని డాక్టర్లు చెప్పారు. సమీపంలోని టిమ్స్‌లో జాయిన్‌ చేశారు. బీపీ, షుగర్‌ ఉన్నాయి. మందులు వేసుకున్నాను. ధైర్యంగా ఉన్నానంతే. అందువల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడలేదు. టిమ్స్‌లో వారం రోజులు ఉంచుకొని పంపించారు.  
– కాట్రగడ్డ అనసూయ (93),సీఆర్‌ ఫౌండేషన్,హైదరాబాద్‌  

ప్లాస్మా ఎక్కించారు  
నాలుగు నెలల కిందట నాకు కరోనా వచ్చింది. వైరస్‌ నిర్ధారణకు ముందు జ్వరం వచి్చపోయేది. నాలుక పొక్కింది. పట్టించుకోలేదు. మందులు వాడాను. టెస్టు చేస్తే కరోనా అని తెలిసింది.ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉంది. షుగర్‌ ఉంది. టిమ్స్‌ ఆసుపత్రిలో ఉంచారు. ప్లాస్మా ఇచ్చారు. ఆరు రోజులు ఉన్నాను. టెన్షన్‌ పడలేదు. కరోనాకు ముందు రోజుకు 40 నిమిషాలు వాకింగ్‌ చేసేవాడిని. ఆసుపత్రి నుంచి వచ్చాక నీరసం ఉండేది. ఇప్పుడు బాగానే ఉన్నాను.  
– వెల్లంకి రామారావు (73), సీఆర్‌ ఫౌండేషన్‌

మనోధైర్యమే కారణం  
90 ఏళ్లు... వందేళ్లు దాటిన వారు కూడా కరోనా నుంచి గట్టెక్కారంటే వారి మనోధైర్యమే ప్రధాన కారణం. పైగా త్వరగా వైరస్‌ను పసిగట్టడం, వెంటనే చికిత్స పొందడంతో వారంతా వైరస్‌ను జయించారు. ఆహారపు అలవాట్లు అత్యంత కీలకం. దాని కారణంగా రోగనిరోధక శక్తి బాగుంటుంది. దానికి తోడు మనోధైర్యం ఆరోగ్యకరంగా ఉండటానికి ప్రధానంగాతోడ్పడుతుంది.  
– డాక్టర్‌ కృష్ణ ప్రభాకర్, ఐసీయూ క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్,సిటీ న్యూరో సెంటర్,హైదరాబాద్‌ 

Poll
Loading...
మరిన్ని వార్తలు