దడ పుట్టిస్తున్న ధరణి పోర్టల్‌

18 Mar, 2022 02:52 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గీతారెడ్డి 

కాంగ్రెస్‌ సర్వోదయ సంకల్పయాత్రలో గీతారెడ్డి

మేడ్చల్‌: ధరణి పోర్టల్‌ వల్ల లాభాల కంటే ఇబ్బందులే అధికమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జె.గీతారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ అధ్యక్షురాలు మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్‌ చేపట్టిన భూదాన్‌ పాదయాత్ర గురువారం మేడ్చల్‌కు చేరింది. అత్వెల్లి వద్ద పాదయాత్ర బృందాన్ని కలిసిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ ధరణి పోర్టల్‌ వల్ల ఎంతోమంది భూములు కోల్పోతున్నారన్నారు.

జహీరాబాద్‌ నియోజకవర్గం సత్వార్‌ గ్రామంలో 200 ఏళ్లుగా రైతుల అధీనంలో ఉన్న 800 ఎకరాల భూమి వక్ఫ్‌ భూమిగా మారిందన్నారు. కేవలం ధరణి వల్ల రైతుల భూమి వారికి కాకుండా చేశారని ఆరోపించారు. అభయహస్తాన్ని పూర్తిగా ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. ఇప్పుడేదో హడావుడి చేస్తున్నా మహిళలకు ఎంతో నష్టం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు.

ఇందిరాగాంధీ హయాంలో ఉన్న ఇళ్లు తప్ప.. రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వం కట్టించిన ఇళ్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. సికింద్రాబాద్, గజ్వేల్, సిద్దిపేటలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కడితే సరిపోదని.. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 

మేడ్చల్‌కు చేరిన యాత్ర 
భూదాన్‌ పోచంపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర మేడ్చల్‌ మీదుగా మెదక్‌ జిల్లాకు చేరింది. మండలంలోని పూడూర్, కిష్టాపూర్, మేడ్చల్, అత్వెల్లి మీదుగా యాత్ర సాగింది. పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొని సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు