‘రేషన్‌’కు ట్రాక్‌.. పరేషాన్‌కు చెక్‌

20 Jan, 2022 04:11 IST|Sakshi
పీడీఎస్‌ బియ్యం బస్తాకు క్యూ ఆర్‌ కోడ్‌

తొలిదశలో 10 వేల రేషన్‌ బ్యాగ్‌లకు క్యూఆర్‌ కోడ్‌ 

సిద్దిపేట, జనగామ జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్ట్‌  

గన్నీ సంచులు, బియ్యం అక్రమ సరఫరాకు అడ్డుకట్ట

సాక్షి, సిద్దిపేట: ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) బియ్యం పక్కదారి పట్టకుండా గన్నీ బ్యాగుకు క్యూఆర్‌ కోడ్‌ను ప్రవేశపెట్టి ‘ట్రాక్‌’లోకి తీసుకువచ్చేందుకు పౌర సరఫరాల అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌తో గన్నీ బ్యాగుల కొరత, రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు చెక్‌ పెట్టవచ్చని భావిస్తున్నారు. రేషన్‌ బియ్యం సరఫరా కోసం ఏటా గన్నీ బ్యాగులను సమకూర్చడం సమస్యగా మారింది. ఈ క్యూఆర్‌ కోడ్‌తో బియ్యం బస్తా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనే దానిని ట్రాక్‌ చేయనున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ 90.4 లక్షలమంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి 10.5 కోట్ల బ్యాగులను వినియోగిస్తోంది. ఇందులో సుమారు 35 శాతం సంచులు ఏటా మాయమవుతున్నాయి. దీంతో ప్రతియేడు గన్నీ బ్యాగుల కోసం టెండర్లు పిలిచి కొనుగోలు చేస్తున్నారు. రేషన్‌ షాప్‌లకు గన్నీ బ్యాగులను ప్రభుత్వం తిరిగి ఒక్కోదాన్ని రూ.21లకు కొనుగోలు చేస్తుంది. బహిరంగ మార్కెట్‌లో దీని ధర ఎక్కువే ఉంటుంది. క్యూఆర్‌ కోడ్‌ ఉన్న బియ్యం బస్తా అక్రమమార్గంలో పట్టుబడితే ఆ బస్తా ఏ షాప్‌నకు చెందినది.. ఏ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి వచ్చిందని తెలుసుకోవడం సులభతరం.  

పైలెట్‌ ప్రాజెక్ట్‌గా సిద్దిపేట, జనగామ 
రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద సిద్దిపేట, జనగామ జిల్లాలను ఎంపిక చేసి క్యూఆర్‌ కోడ్‌ ప్రవేశపెట్టనున్నారు. తొలిదశలో 10 వేల బస్తాలకు కోడ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి క్యూఆర్‌ కోడ్‌ ఉన్న గన్నీ బ్యాగుల ద్వారానే రేషన్‌ షాప్‌లకు బియ్యం సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి రేషన్‌ షాప్‌నకు ఎంత స్టాక్‌ పంపించారు.. నిర్దిష్ట దుకాణంలో ఎన్ని సంచులు అందుబాటులో ఉన్నాయి.. బఫర్‌ గోదాంలో ఇంకా ఎంత స్టాక్‌ ఉంది.. ఇలాంటి చాలా ప్రశ్నలకు క్షణాల్లో సమాధానం తెలుసుకోవచ్చు. ట్యాగ్‌లు తారుమారు చేసినా ప్రూఫ్, డ్యామేజ్‌ చేయబడవు. ఏదైనా ప్రయత్నాలు జరిగితే, సెంట్రల్‌ సర్వర్‌లో హెచ్చరికను జారీచేస్తుంది. దీని ద్వారా అధికారులు ఆ ప్రదేశాన్ని గుర్తించి చర్యలను తీసుకోనున్నారు.

క్యూ ఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేస్తున్నాం
బియ్యం గన్నీ సంచికి క్యూ ఆర్‌ కోడ్‌ తొలివిడతలో ఒక్క రైస్‌ మిల్‌లో కుట్టిస్తున్నాం. ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద సిద్దిపేటను ఎంపిక చేసింది. ఫిబ్రవరి నుంచి సరఫరాను ప్రారంభించే అవకాశాలున్నాయి. గన్నీ బ్యాగులు కొరత రాకుండా క్యూ ఆర్‌ కోడ్‌ ఉపయోగపడనుంది.     
    –హరీశ్, డీఎం, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ 

మరిన్ని వార్తలు