Covid Symptoms: తలనొప్పి, గొంతులో గరగరా? అయితే వెంటనే..

20 Jan, 2022 04:12 IST|Sakshi

ఈ లక్షణాలుంటే కోవిడ్‌ నిర్ధారణే కీలకం 

ఒక్కసారిగా గొంతుగరగర, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం వస్తే కరోనా కావొచ్చు 

ఆలస్యం చేయకుండా పరీక్ష చేయించి నిర్ధారించుకోవాల్సిందే 

సాధారణ లక్షణంగా భావించి తేలికగా తీసుకుంటే ఇంటిల్లిపాదికీ వైరస్‌  

చాలా కేసుల్లో నిర్లక్ష్యమే కరోనా వ్యాప్తికి కారణమంటున్న నిపుణులు 

సాక్షి, హైదరాబాద్‌: ఒక్కసారిగా తలనొప్పా?.. లేక గొంతులో గరగరా?.. లక్షణం ఏదైతేనేం వెంటనే కోవిడ్‌ పరీక్ష చేయించండి. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వేరియెంట్‌ వ్యాప్తి అత్యంత వేగంగా జరుగుతోంది. ఈ వేరియంట్‌తో చాలా మందిలో లక్షణాలు కనిపించడం లేదు. అదలా ఉంచితే.. లక్షణాలు ఉన్న వారు వెంటనే పరీక్ష చేయించి జాగ్రత్తలు పాటించాలని ఐసీఎంఆర్‌ సూచిస్తోంది. ప్రస్తుతం మూడో దశ కోవిడ్‌ వ్యాప్తి కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ సోకితే ఒకట్రెండు రోజుల్లోనే ఒక్కసారిగా తలనొప్పి రావడం, గొంతులో గరగర అనిపించడం, తీవ్ర ఒళ్లు నొప్పులు, ముక్కు కారడం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైలక్షణాలతో పాటు జ్వరం వచ్చిన వారిలో ఎక్కువ మంది పాజిటివ్‌గా తేలడం గమనార్హం. 

పాజిటివ్‌గా తేలితే జాగ్రత్తలివే.... 
ప్రస్తుతం కోవిడ్‌ సోకినట్లు పరీక్షలో నిర్ధారిస్తే వెం టనే ఐసోలేషన్‌కు వెళ్లిపోవాలి. ప్రత్యేక గదిలో వారం రోజుల పాటు ఉండాలి. బాధితుడికి ఉన్న లక్షణాల ఆధారంగా వైద్యులు సూచించిన మేర మందులు వేసుకోవాలి. మూడు పూటలా పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి. కోవిడ్‌ సోకిన వ్యక్తితో పాటు సేవలందించే కుటుంబ సభ్యులు కూడా ఎన్‌–95 మాస్కు ధరించాలి. ప్రస్తుత సీజన్‌ లో వైరస్‌ వ్యాప్తి చెందిన వ్యక్తిలో సగటున ఒక రోజు నుంచి మూడు రోజుల్లో లక్షణాలు బయటపడుతున్నాయి. ఒళ్లు నొప్పులు, ముక్కు కారడం, గొం తులో గరగర లాంటి లక్షణాలు 2,3 రోజులు ఉం టుండగా... జ్వరం, తలనొప్పి లక్షణాలు మాత్రం ఒక రోజులోనే తగ్గుముఖం పడుతున్నాయి.  
♦లక్షణాలు లేని వారికి కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని ఐసీఎంఆర్‌ చెబుతోంది. 
♦ఇక కోవిడ్‌ వ్యాప్తి చెందిన వ్యక్తితో కాంటాక్ట్‌ అయిన 60 ఏళ్లు పైబడిన వాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్లు తప్పక నిర్ధారణ పరీక్ష చేయించాలి. 
♦డెల్టా వేరియంట్‌ వ్యాప్తి చెందిన సమయంలో వైరస్‌ సోకిన వ్యక్తికి నాలుగు నుంచి 
ఐదు రోజుల్లో లక్షణాలు బహిర్గతం కాగా... ఇప్పుడు ఒకరోజు నుంచి మూడు రోజుల్లో బయటపడుతున్నాయి. 

రెండోసారి పరీక్ష అవసరం లేదు.. 
కోవిడ్‌ వచ్చిన తర్వాత ఐసోలేషన్‌లో 7 రోజులు ఉండాలి. ఎనిమిదో రోజు ఎలాంటి నిర్ధారణ పరీక్షలు లేకుండా సాధారణ స్థితికి వచ్చి రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఎన్‌–95 మాస్కులు ముక్కు, నోరు కవర్‌ అయ్యేలా ధరించడం మంచిది. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి. గుమిగూడే ప్రదేశాల నుంచి దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు వాడటంతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చు.
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల 

మరిన్ని వార్తలు