ముస్లిం మహిళల కోసం ‘షీ ఎరా’ 

21 Sep, 2022 08:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న రాచకొండ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. షీ టీమ్స్‌ ఎంపవరింగ్‌ రూరల్‌ ఆస్పిరెంట్స్‌ (షీ ఎరా) అనే ఫ్లాగ్‌షిప్‌ ప్రోగ్రాం కింద గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్‌లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ మేరకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఆర్కేఎస్‌సీ) మహిళా విభాగం, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ భాగస్వామ్యమయ్యారు. త్వరలోనే పహాడీషరీఫ్‌లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ వంటి శిక్షణ ఇస్తారు. ఇందుకు వందల సంఖ్యలో దరఖాస్తులు రాగా.. తొలి విడతలో 50 మంది మహిళలను ఎంపిక చేశారు. వీరిని రెండు బ్యాచ్‌లుగా విభజించి, రోజుకు నాలుగు గంటల చొప్పున ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ధ్రువీకరణ పత్రం అందజేస్తారు.

 వారికే ఎందుకంటే? 
ఇటీవలి కాలంలో పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మైనర్‌ బాలికలను, పిల్లలను వ్యభిచార గృహ నిర్వాహకులకు విక్రయించడం, మానవ అక్రమ రవాణా తదితర కేసులు వెలుగు చూశాయి. ఆయా కేసులలో బాధితులను విచారించగా.. వ్యసనాలకు అలవాటు పడిన భర్తతో విసుగుచెంది, కన్న పిల్లలను పోషించే ఆరి్ధక స్థోమత లేకపోవడంతో పిల్లలను అమ్ముకుంటున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. నిరక్షరాస్యులైన మహిళలకు జీవనోపాధి కల్పిస్తే సమస్యను కొంత వరకు  పరిష్కరించవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. 

(చదవండి: భాద్యత నాది సమ్మె విరమించండి)

మరిన్ని వార్తలు