ప్రధానిని కలవనున్న సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి

26 Dec, 2023 03:10 IST|Sakshi

సాయంత్రం ఖరారైన ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ 

ఐటీఐఆర్‌తో పాటు రాష్ట్ర విభజన హామీలు, రావాల్సిన నిధులపై కేంద్రానికి నివేదన 

కాంగ్రెస్‌ అగ్రనేతలతోనూ భేటీ కానున్న రేవంత్, భట్టి 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత దేశ ప్రధానిని కలిసే సంప్రదాయంలో భాగంగా రేవంత్‌తో పాటు భట్టి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ ఖరారు కావడంతో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వినతులతో ఢిల్లీ బయలుదేరేందుకు ఇరువురు నేతలు సిద్ధమవుతున్నారు.

ముఖ్యంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గత పదేళ్లలో అమలు కావాల్సిన హామీలు, ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై ప్రధాని మోదీతో చర్చించి వినతిపత్రాలు అందజేయనున్నట్టు సమాచారం. దీంతో పాటు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించి ఆ మేరకు వినతిపత్రాలు కూడా ఇస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

వీలైతే రాహుల్‌ గాందీతోనూ భేటీ 
ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలతో కూడా రేవంత్, భట్టిలు సమావేశం కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత కె.సి.వేణుగోపాల్‌తో పాటు వీలును బట్టి రాహుల్‌గాందీతో కూడా ఈ ఇరువురు సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవులతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై పార్టీ పెద్దలతో ఇరువురు నేతలు చర్చిస్తారని గాం«దీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. 

సీఎంను కలిసిన మంత్రి కోమటిరెడ్డి 
రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, సాత్విక్‌రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కోమటిరెడ్డి.. రేవంత్‌తో భేటీ అయ్యారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి కూడా రేవంత్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌.. రేవంత్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు.  

రేవంత్‌కు దగ్గు, గొంతు నొప్పి.. 
సీఎం రేవంత్‌రెడ్డి దగ్గు, గొంతునొప్పితో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన సోమవారం నాడు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోలేదు. సీఎంను పరిశీలించిన డాక్టర్లు గట్టిగా మాట్లాడరాదని సూచించినట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు