బొటానికల్‌ గార్డెన్‌లో అరుదైన తూనీగ

17 Mar, 2022 01:04 IST|Sakshi

జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని బొటానికల్‌ గార్డెన్‌లో రియోథెమిస్‌ వరిగేటా జాతికి చెందిన రంగురంగుల తూనీగను గుర్తించినట్లు గార్డెన్‌ సమన్వయకర్త డాక్టర్‌ సదాశివయ్య తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన భరత్‌ అనే వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ గార్డెన్‌ను సందర్శించి పక్షులు, జంతువులను కెమెరాలో బంధిస్తుండగా అరుదైన తూనీగను గుర్తించినట్లు తెలిపారు.

సాధారణంగా ఇలాంటి తూనీగలు చిత్తడి నేలలో ఎక్కువగా నివసిస్తూ చిన్న చిన్న క్రిమి కీటకాలను తింటూ జీవిస్తాయన్నారు. ఈ రకమైన తూనీగలు మనదేశంతో పాటు, చైనా, వియత్నాం, జపాన్‌ దేశాల్లో మాత్రమే జీవిస్తాయన్నారు. అనేక అరుదైన మొక్కలు, జంతువులకు తెలంగాణ బొటానికల్‌ గార్డెన్‌ నిలయంగా మారుతోందన్నారు.

మరిన్ని వార్తలు