ఆ వడ్లకు పైసలిచ్చేస్తాం!

19 Dec, 2023 03:57 IST|Sakshi

రైస్‌ మిల్లర్ల వద్ద నిల్వ ఉన్న 83 ఎల్‌ఎంటీ ధాన్యంపై సర్కార్‌ సీరియస్‌

ఈ ధాన్యం విలువ రూ.18వేల కోట్లుగా తేలిన లెక్క

నిల్వ ఉన్న ధాన్యాన్ని ఇప్పటికే మిల్లర్లు అమ్ముకున్నట్లు ప్రభుత్వ నిర్ధారణ 

 మిల్లుల్లో లెక్క చూపిన ధాన్యం ధర చెల్లించేందుకు సిద్ధమని సర్కార్‌కు మిల్లర్ల రాయభారం

క్వింటాలుకు రూ.2,350 చొప్పునవసూలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం?

సాక్షి, హైదరాబాద్‌: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లులకు పంపిన 83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఏమైందో లెక్క తెలియడం లేదని సాక్షాత్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మిల్లర్లు బెంబేలెత్తుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే మంత్రి ఉత్తమ్‌ పౌరసరఫరాల సంస్థ పనితీరుపై సమీక్ష నిర్వహించి రూ.56 వేల కోట్ల అప్పులు, రూ.11 వేల కోట్ల నష్టాల్లో ఉన్నట్లు తేల్చారు.

ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్‌లలో చోటు చేసుకున్న అవకతవకలే అందుకు కారణమని, మిల్లర్లు ఇప్పటికే ధాన్యాన్ని విక్రయించడంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు కూడా లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మిల్లర్లలో ఆందోళన మొదలైంది. సర్కార్‌ ధాన్యం విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోకముందే రాజీ చేసుకోవాలని భావిస్తున్నారు. తమ వద్ద ఉన్న ధాన్యం నిల్వ విలువను ఖర్చులతో కలిపి ప్రభుత్వానికి చెల్లించాలని ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయమేదీ తీసుకోలేదు.

మిల్లర్ల వద్ద 83 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం 
గత సంవత్సరం రబీ(యాసంగి)లో సేకరించిన 67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ముడిబియ్యంగా మిల్లింగ్‌ చేసేందుకు పనికిరాదని, బాయిల్డ్‌ రైస్‌గా మాత్రమే మిల్లింగ్‌ చేయడానికి వీలవుతుందని మిల్లర్లు తేల్చి చెప్పారు. ఈ మేరకు 67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లుల్లోనే నిల్వ చేసినట్లు లెక్కలు చూపించారు. ఇదే కాకుండా గత సంవత్సరం వానకాలానికి సంబంధించిన మరో 16 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కూడా మిల్లింగ్‌ చేసి, ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌ అప్పగించడంలో మిల్లర్లు విఫలమయ్యారు.

ఈ మొత్తం 83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం విలువ సుమారు రూ. 18 వేల కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. సంస్థకున్న రూ.56 వేల కోట్ల అప్పుల్లో  ఈ రూ.18 వేల కోట్లు చెల్లిస్తే తప్ప మళ్లీ అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిల్లర్ల వద్ద ఉన్నట్లు చెపుతున్న 83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంపై కీలక నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దీనిపై పౌరసరఫరాల సంస్థ సీఎండీ అనిల్‌ కుమార్, ఇతర అధికారులు ప్రణాళిక రూపొందించారని తెలిసింది. మిల్లర్లు స్వయంగా ధాన్యం విలువ చెల్లించేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన కనీస మద్ధతు ధరకు తోడు, రవాణా, నిర్వహణ ఖర్చులన్నీ మిల్లర్ల నుంచి వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

వేలం ప్రయత్నాలు విఫలం..
మిల్లర్లు సీఎంఆర్‌కు తిరస్కరించిన యాసంగి ధాన్యాన్ని విక్రయించాలని గత ప్రభుత్వం ఆగస్టు నెలలో నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత 25 లక్షల మెట్రిక్‌ టన్నుల దాన్యాన్ని అమ్మేందుకు బిడ్డర్ల నుంచి టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లకు 10 సంస్థలే అర్హత సాధించడంతో పాటు ధాన్యం క్వింటాలుకు సగటు ధరను రూ.1865 గా కోట్‌ చేయడంతో ఈ ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో ప్రభుత్వం అక్టోబర్‌లో రెండో దఫా టెండర్లను ఆహ్వానించింది.

నిబంధనలను సడలించి సాధారణ మిల్లర్లు కూడా బిడ్డింగ్‌లో పాల్గొనేలా టెండర్లను ఆహ్వానించింది. అయితే ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో  ఆ టెండర్లకు ఎన్నికల సంఘం బ్రేక్‌ వేసింది. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువు దీరినప్పటికీ, పాత టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్ల వద్ద  83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉన్నట్లు లెక్కల్లో కనిపిస్తున్నప్పటికీ, అందులో సగానికి పైగా విక్రయించినట్లు పౌరసరఫరాల సంస్థ ఇప్పటికే గుర్తించింది.

కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ధాన్యాన్ని, బియ్యాన్ని విక్రయించినట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. ఈ పరిస్థితుల్లో మిల్లర్ల నుంచి ధాన్యం విలువకు సమానమైన మొత్తాన్ని ( క్వింటాలుకు రూ. 2,350) చొప్పున ముక్కు పిండి వసూలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో మిల్లుల్లో ఉన్న ధాన్యంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 

>
మరిన్ని వార్తలు