11 జిల్లాల్లో రెండోవిడత జ్వర సర్వే షురూ 

31 Jan, 2022 02:40 IST|Sakshi

మిగిలిన జిల్లాల్లో త్వరలో ప్రారంభం..

సాక్షి, హైదరాబాద్‌: రెండోవిడత ఇంటింటి జ్వర సర్వే 11 జిల్లాల్లో ఆదివారం ప్రారంభమైంది. జగిత్యాల, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, నారాయణపేట, నిర్మల్, వనపర్తి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో మొదటి విడత సర్వే పూర్తికాగానే మొదలుపెడతారని పేర్కొంది. సర్వేలో భాగంగా కరోనా లక్షణాలున్నవారిని గుర్తించి కిట్లు అందజేస్తుండటంతో ఎక్కడికక్కడే వ్యాప్తిని కట్టడి చేయగలుగుతున్నారు.

రోగుల పరిస్థితి తీవ్రం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సెకండ్‌ వేవ్‌లో మూడు, నాలుగుసార్లు కూడా జ్వర సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు ఏకంగా 8 లక్షల మందికి మెడికల్‌ కిట్లు అందజేశారు. ఇప్పుడు కూడా అవసరాన్ని బట్టి పలు విడతలుగా జ్వర సర్వే చేపడతామని అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి 29 వరకూ జరిగిన మొదటి విడత సర్వేలో రాష్ట్రంలో కేవలం 9 రోజుల వ్యవధిలోనే 4,00,283 మందిలో కరోనా లక్షణాలున్నట్లుగా గుర్తించారు. వీరిలో అందరికీ కరోనా అని నిర్ధారణ కాకపోయినా, 3,97,898 మందికి మెడికల్‌ కిట్లు అందజేశారు.   

మరిన్ని వార్తలు