ప్రత్యేక బృందాలు.. పటిష్ట చర్యలు

7 Jan, 2021 02:14 IST|Sakshi

బర్డ్‌ ఫ్లూపై పశుసంవర్ధక శాఖ అప్రమత్తం 

1,300 స్పెషల్‌ టీంలు ఏర్పాటు.. ఇప్పటికే 276 శాంపిల్స్‌ సేకరణ 

వ్యాధి సోకినట్లు గుర్తిస్తే పక్షుల ఖననానికి ఏర్పాట్లు 

అధికారులతో మంత్రి తలసాని ఉన్నత స్థాయి సమీక్ష 

రాష్ట్రంలో వైరస్‌ ఆనవాళ్లు లేవన్న మంత్రి 

సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న బర్డ్‌ ఫ్లూ వైరస్‌పై రాష్ట్రం అప్రమత్తమైంది. ఇప్పటికే రాజస్తాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ వ్యాధి కారణంగా వేలాది పక్షులు మృత్యువాత పడడం, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి సమీపంలోనూ ఇలాంటి సంఘటనే జరిగిందనే వార్తల నేపథ్యంలో ఈ వైరస్‌ నిరోధానికి రాష్ట్ర యంత్రాంగం పటిష్ట చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పశుసంవర్థక శాఖ దాదాపు 1,300 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా కోళ్లు, ఇతర పక్షుల నుంచి 276 శాంపిల్స్‌ సేకరించింది.

పరీక్షల్లో బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు కనిపించనప్పటికీ రాష్ట్రంలోకి ఈ వ్యాధి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనికోసం తగిన వ్యాక్సినేషన్‌ (కెమికల్‌) ఏర్పాట్లూ చేస్తోంది. ఒకవేళ రాష్ట్రంలోకి వైరస్‌ ప్రవేశిస్తే ఏం చేయాలనే దానిపైనా కార్యాచరణ రూపొందించినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, 2016లో బర్డ్‌ ఫ్లూ సోకిన కారణంగా రాష్ట్రంలో లక్షకు పైగా కోళ్లను ఖననం చేశారు. పౌల్ట్రీ ఫాంలకు 3–5 కిలోమీటర్ల దూరంలోని కోళ్లనూ పూడ్చిపెట్టారు.  

మనకు అవకాశం తక్కువే.. 
రాష్ట్రంలోకి బర్డ్‌ ఫ్లూ ప్రవేశించే అవకాశాలు తక్కువేనని పశుసంవర్థక శాఖ అంచనా వేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కాకులు, బాతుల్లో మాత్రమే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నందున మన రాష్ట్రంలోని కోళ్లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని భావిస్తోంది. అలాగే కోడి మాంసం ఉడకబెట్టిన తర్వాతే తింటారు కనుక మనుషులకు ఈ వైరస్‌ సోకే అవకాశాలు లేవని, రాష్ట్రం నుంచి గుడ్లు, కోళ్లు ఎగుమతి చేయడమే కానీ, దిగుబడి చేసుకునే పరిస్థితి లేనందున ఈ వ్యాధి వచ్చే అవకాశం తక్కువంటోంది.  

భయపడొద్దు: మంత్రి తలసాని 
రాష్ట్రంలో ఇప్పటివరకు బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు లేవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ఉన్నతస్థాయి అధికారులతో మాసబ్‌ట్యాంక్‌ లోని తన కార్యాలయంలో బుధవారం ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, ఆ శాఖ అధికారులు, పౌల్ట్రీ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి, మన రాష్ట్రంలోకి వచ్చే పరిస్థితి గురించి మంత్రికి అధికారులు వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యల కారణంగా రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తికి అవకాశం లేదన్నారు. 1,300 బృందాలు నిరంతరం వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. అన్ని స్థాయిల్లోని అధికారులనూ అప్రమత్తం చేశామని వివరించారు. కోళ్ల పరిశ్రమ విషయంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని, అనవసరపు అపోహలకు తావివ్వొద్దని కోరారు.

మరిన్ని వార్తలు