సర్కారు రథం.. సంక్షేమ పథం

29 Dec, 2021 04:20 IST|Sakshi

దళితుల సమగ్ర అభివృద్ధి కోసం దళితబంధు పథకం 

స్వయం ఉపాధి కోసం రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం 

దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. విడతల వారీగా లబ్ధిదారుల ఎంపిక 

ప్రయోగాత్మకంగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ‘తెలంగాణ దళితబంధు పథకం’సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకంతో శ్రీకారం చుట్టింది. దేశంలోనే పెద్ద మొత్తంలో ఆర్థిక సాయాన్ని అత్యధిక కుటుంబాలకు అందించే పథకం ఇదే. దీనికింద రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున లబ్ధి కలగనుంది. ముందుగా ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ప్రారంభించారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంతోపాటు వాసాలమర్రి గ్రామంలో మొత్తంగా 18,064 మందిని ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఒక్కో లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో రూ.10లక్షల చొప్పున జమ చేసింది. భారీ మొత్తంలో సాయం అందించే ఈ పథకం 2021 సంవత్సరంలో రాజకీయరంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ పథకాన్ని తెస్తున్నారనే అంశంపై వివిధ పార్టీలు దుమారం రేపాయి.

కానీ దళితుల సంక్షేమమే ముఖ్యమంటూ చెప్పిన ప్రభుత్వం హుజూరాబాద్‌లో సంతృప్తికరస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేసింది. లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. ఈ పథకాన్ని మరో నాలుగు మండలాల్లో సంతృప్తికరస్థాయిలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులోభాగంగా తిరుమలగిరి, చింతకాని, చారగొండ, నిజాంసాగర్‌ మండలాల్లో జాబితాను పూర్తి చేసిన ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది.

ప్రాథమికంగా ఎంపికైన లబ్ధిదారులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్సీ కార్పొరేషన్‌ సిద్ధమయ్యాయి. ఇదిలావుండగా, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే ఉద్దేశంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వంద మంది లబ్ధిదారుల ఎంపికకు ఉపక్రమించింది. ఎంపిక బాధ్యతలను స్థానిక శాసనసభ్యులకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

భారీ సాయం 
రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యానిధి పేరిట విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున సాయం అందిస్తోంది. ఒక లబ్ధిదారుకు అత్యంత ఎక్కువ సాయాన్ని అందించే పథకం విద్యానిధి అయినప్పటికీ... ఏటా లబ్ధిదారుల సంఖ్య వెయ్యికి మించడం లేదు. అయితే దళితబంధు కింద అందించే సాయం రెండో పెద్దది కాగా, వేల సంఖ్యల లబ్ధిదారులకు సాయం అందించడంతో ఈ పథకం రికార్డు సృష్టించడం విశేషం.   

మరిన్ని వార్తలు