రాజ్‌భవన్‌కు సీఈవో.. అసెంబ్లీ రద్దు ప్రతులతో సెక్రటరీ

4 Dec, 2023 16:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటునకు రంగం సిద్ధమవుతోంది. ఏఐసీసీ నుంచి సీఎల్పీ నేత ఎంపికపై స్పష్టత రాగానే.. సాయంత్రం రాజ్‌భవన్‌లో సీఎం ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి కూడా. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు టెక్నికల్ క్లియరెన్స్ పనిలో గవర్నర్ తమిళిసై  సౌందరరాజన్‌ బిజీగా ఉన్నారు. 

ప్రస్తుత అసెంబ్లీ రద్దుకు సంబంధించిన ఏర్పాట్లు రాజ్‌భవన్‌లో నడుస్తున్నాయి. అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు శాసనసభ రద్దు ప్రతులను అందజేశారు. ఆ వెంటనే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(సీఈవో) వికాస్‌ రాజ్‌, ఈసీ ప్రత్యేక అధికారితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నివేదికను గవర్నర్‌కు సీఈవో అందజేశారు. ఈ ఫార్మాలిటీస్‌ పూర్తి కాగానే.. కొత్త అసెంబ్లీ ఏర్పాటు కోసం గెజిట్‌ ఇచ్చేందుకు గవర్నర్‌ ఆదేశాలు జారీ చేస్తారు. ఈ అధికార ప్రక్రియ కొనసాగుతుండగానే..

మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. ఈ రాత్రికే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో.. ప్రోటోకాల్‌ అధికారులు రాజ్ భవన్ చేరుకున్నారు. మరోవైపు రాజ్‌భవన్‌ వద్ద కోలాహలం నెలకొంది. ఆహ్వానం లేకపోయినా కాంగ్రెస్‌ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నాయి. దీంతో.. భారీగా పోలీసులు మోహరించారు.

>
మరిన్ని వార్తలు