బీఆర్‌ఎస్‌ది ఘోర పరాజయం కాదా?

4 Dec, 2023 17:51 IST|Sakshi

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీది ఘన విజయమేనా? ఇంతకాలం అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ది ఘోర పరాజయమేనా?.. ఈ ఫలితాలు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంకేతాలు ఇచ్చాయి? మొత్తం ఫలితాలను విశ్లేషిస్తే.. కాంగ్రెస్ పార్టీది పూర్తి స్థాయి వేవ్ కాదనే అర్ధం అవుతోంది. అలాగే బీఆర్‌ఎస్‌ది ఘోర పరాజయం కాదని తెలుస్తుంది. ఎంత కాదన్నా ఓటమి ఓటమే కాబట్టి దానికి ఎలాంటి మినహాయంపు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేసీఆర్‌ ప్రభుత్వంపై  వచ్చిన వ్యతిరేకతే కాని, కాంగ్రెస్ కు వచ్చిన పాజిటివ్ ఓటు కాదనిపిస్తోంది. 


✍️కాంగ్రెస్ ప్రభంజనం అయితే డెబ్బై నుంచి ఎనభై సీట్లవరకు సంపాదించి ఉండేది. మిత్రపక్షం సీపీఐ గెలిచిన సీటుతో కలిపి కాంగ్రెస్కు  65 స్థానాలే దక్కాయి. అంటే మెజార్టీకి అవసరమైన దానికన్నా ఐదు సీట్లే ఎక్కువచ్చాయి. బొటాబొటి మెజార్టీ అన్నమాట!. గత ఎన్నికలలో బీఆర్ఎస్ కు 88 సీట్లు వచ్చాయి. అప్పుడు అది పాజిటివ్ వేవ్ గా కనిపించింది. ఇప్పుడు కాంగ్రెస్ కు అదే తరహాలో సీట్లు వచ్చి ఉంటే వారి మేనిఫెస్టోకి ప్రజలు ఆకర్షితులై ఓట్లు వేశారన్న భావన కలిగేది. ఎందుకంటే ఈసారి  కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మేనిఫెస్టోలు రెండూ దాదాపు ఒకరకంగానే ఉన్నాయి.


✍️ఉమ్మడి ఖమ్మం,నల్గొండ,వరంగల్ వంటి జిల్లాలలో కాంగ్రెస్ స్వీప్ చేస్తే.. హైదరాబాద్ నగరం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలో బీఆర్ఎస్ వేవ్ వచ్చింది. హైదరాబాద్ నగరంలో ఒకటి తప్పా అన్ని సీట్లు బీఆర్ఎస్, ఎంఐఎం ఖాతాలోకి రాగా, కాంగ్రెస్‌కు ఒక్క సీటు దక్కకపోవడం నిదర్శనంగా కనిపిస్తోంది. అయినా బీఆర్ఎస్ ఎందుకు ఓటమిపాలైంది? ఇది బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  స్వయంకృతాపరాధం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన అహంభావ దోరణే అయనను దెబ్బ తీసింది. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలను ఆయనే  పోశారనిపిస్తోంది.


✍️భారతీయ జనతా పార్టీ తన గ్రాఫ్ పెంచుకుంటుందని ఊహించినట్లే జరిగింది. కాని, అది ఆశించినంత పెరగలేదని చెప్పాలి. కాంగ్రెస్కు వేవ్ రాకపోతే హంగ్ పరిస్థితి ఏర్పడవలసి ఉంది.  బీఆర్ఎస్ కు సొంతంగా పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎన్నికల ప్రక్రియ ఆరంభం అయినప్పటి నుంచి కనిపిస్తూనే ఉంది. ఆ విషయాన్ని ఎంతో అనుభవం కలిగిన కేసీఆర్‌  కనిపెట్టలేకపోయారు. ముందస్తుగా అభ్యర్ధుల ప్రకటన చేయడం వ్యూహాత్మకంగా సరైందే అయినా.. వారిలో నెగిటివ్ ఉన్న సిటింగ్ ఎమ్మెల్యేలను ఎక్కువ మందిని  మార్చకుండా అతి విశ్వాసానికి పోయారు. ఫలితంగా..  39  సీట్లకే పరిమితం అయ్యారు. ఎమ్మెల్యేల మార్చకపోవడం వల్ల   కనీసం పది,పదిహేను సీట్లను ఆయన చేజేతులారా కోల్పోయారు. అవి వచ్చి ఉంటే ఏభై నుంచి ఏభైఐదు సీట్ల వరకు బీఆర్ఎస్ లాగగలిగేది. అప్పుడు కాంగ్రెస్ కు అరవైఐదు సీట్లు రావడం కష్టం అయ్యేది. అయితే.. ఆఖర్లో కెసిఆర్ పన్నెండు సీట్లలో మార్చితే.. తొమ్మిదింట కొత్తవారు గెలిచిన సంగతి గమనించాలి.  

✍️తెలంగాణలో హంగ్ వచ్చి ఉంటే..  కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు ఇవ్వలేదు. ఎంఐఎం ఎటూ తనకే మద్దతు ఇస్తుంది కనుక బీఆర్‌ఎస్‌  అధికారంలోకి  రావడానికి చాన్స్ ఉండేది. అది కేసీఆర్‌ వైఫల్యం.  కేసీఆర్ తనకు అవసరం లేకపోయినా గత ఎన్నికలలో గెలిచిన తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. దానివల్ల బీఆర్ఎస్ లో ఉన్న నేతలకు ఈసారి టిక్కెట్లు ఇవ్వలేకపోయారు.  కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలలో పది మంది వరకు ఓటమి చెందారు. దీనికి ఉదాహరణ పాలేరు, కొత్తగూడెం లలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడం వల్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటివారిని ఆయన వదలుకోవల్సి వచ్చింది. ఇతర విమర్శలను పక్కనపెడితే.. వ్యూహాత్మకంగా బీఆర్‌ఎస్  ఇలాంటి  రాజకీయతప్పిదాలు చేయడం  వల్ల వారు భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది.

✍️ కాంగ్రెస్ విషయాన్ని చూస్తే.. వరసగా మూడు ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయిన పార్టీ.. అసాధారణ రీతిలో అరవై ఐదు సీట్లు గెలవడం గొప్ప విషయమే. ఇది కాదనం.. కాకపోతే దీనిని ఘన విజయంతో పోల్చలేకపోవడానికి  కారణం ఏమిటంటే  అనుకూల వేవ్ తెచ్చుకోలేకపోవడం. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పటి నుంచి  వరస పరాజయాలు ఎదురైనా, ఆయన ఎక్కడా వెనక్కి తగ్గకుండా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతూ వచ్చారు. ఘాటైన విమర్శలు సాగిస్తూ వచ్చారు. కాంగ్రెస్‌లో అందరిని కలుపుకుని వెళ్లడంలో ఇబ్బందులు ఉన్నా సర్దుకుపోయారు. టిక్కెట్ల కేటాయింపు సమయంలో కొంతమంది వృద్దనేతలను పక్కన బెట్టి యూత్ కు అవకాశం ఇచ్చారు. అలాగే మిర్యాలగూడ వంటి కాంగ్రెస్  గెలుపు అవకాశం ఉన్న సీటును సీపీఎంకు ఇవ్వకుండా నిరాకరించి పొత్తును వదలుకోవడానికి కూడా సిద్దపడ్డారు. పార్టీలో టిక్కెట్లురాని  వారి అసంతృప్తిని తగ్గించడంలో అసమ్మతి ఎక్కువగా లేకుండాచేయడంలో  ఆయన సఫలం అయ్యారు. ఒకవైపు తనను తాను అందరికి ఆమోదయోగ్యమైన నేతగా గుర్తింపు పొందే విధంగా ప్రయత్నిస్తూనే తన  ఆధిపత్యం  తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన ప్రధాన నేతగా రేవంత్ ఒక్కరే కనిపించారు.తద్వారా పార్టీలో జోష్ పెంచారు.

✍️ భారతీయ జనతా పార్టీ నిజానికి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతుందని ఒక దశలో వాతావరణం ఏర్పడింది. కానీ ఆ పార్టీ అధిష్టానం ఏ ఉద్దేశంతో  కొన్ని నిర్ణయాలు చేసిందోకాని, అలాగే కొన్నిపరిణామాలకు ఎందుకు కారణం అయిందో కాని.. కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్లయింది. కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తానే  బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయని  ప్రజలలో గుర్తింపు పొందగలిగింది. ఆరు గ్యారంటీలను చూసే  ప్రజలు ఓట్లు వేశారని చెప్పలేం. కాకపోతే ఎన్నికలలో గెలిచాక ఆ మేనిఫెస్టోపై అందరూ దృష్టి పెడతారు. ప్రజలు ముందు అధికారంలో ఉన్న పార్టీపై తమ వ్యతిరేకత చూపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఏమి చేయబోతోంది గమనిస్తారు!. 

✍️ కేసీఆర్‌ అత్యధిక  సమయం ప్రగతి భవన్ కే పరిమితం అవడం, ప్రజలకు తగు సమయం  ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా కలవరన్న ప్రచారం జరగడం మొదలైన విషయాలు బాగా అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. కొత్త సచివాలయం కట్టాలని ఏ జ్యోతిష్కుడు చెప్పారో కాని.. అది కూడా ప్రజలలో నెగిటివ్ పెంచింది. వందల కోట్ల రూపాయలు వృథా చేశారన్న అభిప్రాయం వచ్చింది.  దళిత బంధు స్కీం  పేరుతో పది లక్షల రూపాయల ఆర్దికసాయం చేయడం ఆచరణ సాధ్యం కాదని తెలిసినా. దానిని అమలు చేయడానికి ముందుకు వెళ్లి బొక్కబోర్లా పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వారికే అవి దక్కుతున్నాయని మిగిలినవారికి కోపం తెప్పించింది.అందులో ముప్పై శాతం డబ్బు అవినీతి కింద పోతోందని స్వయంగా కేసీఆరే ప్రకటించారు. దళితులకుమాత్రమే బంధు స్కీమ్ ఇస్తారా అని బీసీలు, మైనార్టీలు తదితర వర్గాలు ప్రశ్నించసాగాయి. అవన్నీ బీఆర్‌ఎస్‌కు  తీవ్ర నష్టాన్ని తెచ్చి పెట్టాయి. 

కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడంలో మంచి ఉద్దేశమే ఉన్నా, దానిని నిపుణుల నిర్ణయాలకు వదలకుండా, తానే అన్నీ చేయగలనని భావించి తదనుగుణంగా వ్యవహరించడం పెద్ద ప్రమాదమే అయింది. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ కుంగి పోవడం కేసీఆర్‌కు తీరని అప్రతిష్ట తెచ్చింది. నిజంగా ఆ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం కలిగి ఉంటే ఉత్తర తెలంగాణలో భారీ స్థాయిలో సీట్లు గెలవాల్సి ఉంది. అక్కడ కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా గణనీయ ఫలితాలు  సాధించింది. దీనిని బట్టే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.

✍️ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరిగా పరీక్షలు నిర్వహించలేకపోవడం, గ్రూప్ పరీక్షలు జరిగి ఉద్యోగాలు రాకపోవడం కూడా బాగా డ్యామేజ్‌ అయింది. కేటీఆర్‌ స్వయంగా వెళ్లి దానిని చక్కదిద్దడానికి యత్నించినా, అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. తెలంగాణ ఉద్యమకారులను దూరం చేసుకోవడం తో వారిలో పలువురు ఊరూవాడా తిరిగి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసి ప్రభావితం చేయగలిగారు. కుటుంబ పాలన అనే విమర్శకు సరైన సమాధానం చెప్పలేకపోయారు.వీటన్నిటికి మించి ఆయన రెండో నియోజకవర్గంగా కామారెడ్డిని ఎంపిక చేసుకోవడం కూడా తెలివైన నిర్ణయం కాదని ఆయన ఓటమి రుజువు చేసింది. ఎవరికి చెప్పకుండా, అచ్చంగా గతంలో ఎన్.టి.ఆర్ కల్వకుర్తిలో పోటీచేసి పరాజయం చెందిన రీతిలోనే కేసీఆర్ ఓటమిపాలయ్యారు.  ఇన్ని లోపాలు ఉన్నా ఓవరాల్ గా చూసినప్పుడు ప్రభుత్వ పనితీరు మరీ నాసిరకంగా లేదు.

✍️మంత్రిగా కేటీఆర్‌ బాగానే రాణించారు. హైదరాబాద్ లో ఐటి పరిశ్రమకు సంబందించి ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. హైదరాబాద్ లో అభివృద్ది పనులు బాగానే చేశారు. అందువల్లే పార్టీకి ఈ మాత్రం అయినా సీట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంక్షేమ స్కీములను అమలు చేశారు. రైతు బంధు , రైతుల రుణ మాఫీ వంటివాటిని చాలావరకు చేశారు.  అయితే పట్టణాలపై పెట్టిన దృష్టి.. పల్లె ప్రాంతాలలో పెట్టలేదన్న భావన బలపడింది. ఎందుకో ఏడాది నుంచే పల్లెల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. దానిని తగ్గించుకోవడంలో  కేసీఆర్‌ ప్రభుత్వం విఫలం అయింది. ఇంకో సంగతి చెప్పాలి. ఈనాడు వంటి మీడియా కేసీఆర్‌ ప్రభుత్వానికి అండగా నిలిచి, ప్రభుత్వ పొరపాట్లను,లోటుపాట్లను బయటకు రాకుండా చేయాలని ప్రయత్నించినా అది సఫలం కాలేదు. కేవలం మీడియా వల్లే పార్టీలు గెలవడం, ఓడడం జరగదని మరోసారి తేలింది.  కేసీఆర్‌ యజ్ఞం చేసినా ఈ విడత విజయం సాధించలేదు. అందువల్ల అలాంటి సెంటిమెంట్లు కొంతమేరే తప్ప ఎప్పుడూ ఉపయోగపడవని కూడా రుజువైంది. బీజేపీ గనుక బండి సంజయ్ ను మార్చకపోవడం, డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేస్తామంటూ ప్రచారం చేసినా, అలా జరగకపోవడం తదితర కారణాలతో బీజేపీ తన అవకాశాలాను తానే వదలుకుందనిపిస్తుంది. బీజేపీ మరికాస్త మెరుగ్గా పనిచేసినా హంగ్ వచ్చి ఉండేది. అప్పుడు బీజేపీకి చక్రం తిప్పే అవకాశం వచ్చేదేమో!

✍️తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత విజయం సాధించడం కాంగ్రెస్‌కు పెద్ద ఊరట. మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలవలేకపోయిన బాధ ఉన్న సమయంలో కొంత ఊరటగా తెలంగాణలో గెలిచారు. తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలను యధావిధిగా అమలు చేయడం అంత తేలికైన సంగతి కాదు. కాంగ్రెస్ వాటిని అమలు చేస్తే వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మంచి ఫలితాలు పొందగలుగుతుంది. లేకపోతే మాత్రం ఆ ఎన్నికలు కాంగ్రెస్ కు పెద్ద సవాలు అవుతాయి. బీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమైన పాయింటే. ఆ పార్టీలో నాయకత్వ స్థాయిలో కేటీఆర్‌, హరీష్ రావు ల మధ్య విబేధాలు వంటివి చోటు చేసుకుంటే చాలా కష్టాలు వస్తాయి. తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఆకర్షించకుండా జాగ్రత్తపడవలసి ఉంటుంది.

ఏది ఏమైనా కాంగ్రెస్ అధికారం వచ్చిందన్న సంతోషం ఉన్నా, భవిష్యత్తులో ఎన్నో గండాలు అధిగమనించవలసి ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా గట్టిగా నిలబడగలిగితేనే  భవిష్యత్తు ఎన్నికలలో ప్రభావం చూపగలుగుతుంది. వీటిలో ఏది జరగకపోయినా బీజేపీ మరింత పుంజుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికలు బీఆర్ఎస్ కు కాస్ట్ లీ అనుభవం  అయితే, కాంగ్రెస్ కు మరీ ఫ్రీ హాండ్ ను ప్రజలకు  ఇవ్వలేదు. బీజెపిని ఇంకా వెయిటింగ్ లోనే ఉంచారని చెప్పాలి.


:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

>
మరిన్ని వార్తలు