డిజిటల్‌ మీడియాతో ఉన్నత విద్య పటిష్టం 

24 Aug, 2022 02:22 IST|Sakshi

బంజారాహిల్స్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిజిటల్‌ మీడియా ద్వారా తెలంగాణలో ఉన్నత విద్యను పటిష్ట పరుస్తున్నారని తెలంగాణ ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, సెంటర్‌ ఫర్‌ ఇంటర్నల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌(సికా), ఎక్సెల్‌ ఇండియా మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో బ్రిడ్జింగ్‌ ఎడ్యుకేషనల్‌ డివైడ్‌(ఒడీఎఫ్‌ఎల్‌ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌)్ఙ అనే అంశంపై ఒక రోజు సింపోసియం నిర్వహించారు.

పలువురు విద్యారంగ నిపుణులు, నాయకులు పాల్గొని ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ, రానున్న రోజుల్లో విద్యా రంగంలో మార్పులు, అటు ప్రభుత్వాలు ఇటు విద్యా సంస్థలు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను విస్తృతంగా చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగానికి విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతానికి బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. గ్రామీణ పాఠశాలలను కూడా ఆన్‌లైన్‌ విద్యా విధానానికి అనుసంధానం చేయనున్నట్లు వివరించారు.

సాంకేతిక కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ.. సాంకేతిక విప్లవం నేపథ్యంలో తరగతి గది వాతావరణం పూర్తిగా మారిపోయిందన్నారు. ఆన్‌లైన్‌ విద్యా బోధనలో వినూత్న మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ప్రొ.ఆర్‌.లింబాద్రి, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య.కె.సీతారామారావు, టి–శాట్‌ సీఈవో శైలేష్‌రెడ్డి, ‘సికా’ డైరెక్టర్‌ ప్రొ. ప్రొ.పి.మధుసూదన్‌రెడ్డి, ఎక్సెల్‌ ఇండియా చీఫ్‌ ఎడిటర్‌ సంగెం రామకృష్ణ, విశ్వవిద్యాలయ, రిజిస్ట్రార్‌ డా ఏవీఎన్‌ రెడ్డి, డీన్‌ సోషల్‌ సైన్సెస్‌ ప్రొ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు