Corona Vaccine: ఆపకుండా అందరికీ..

25 May, 2021 02:32 IST|Sakshi

45 ఏళ్లు నిండిన అందరికీ తొలి డోసు పంపిణీ 

30ఏళ్లుపైబడిన వారిని కేటగిరీలుగా విభజించి టీకాలు 

జనంతో మమేకమయ్యే వారికి ప్రాధాన్యత 

ఇందులో భాగంగానే సీఎం ‘సూపర్‌ స్ప్రెడర్‌’ వ్యాఖ్యలు త్వరలోనే నిర్ణయం!

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో అర్హులైన అందరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కోవిడ్‌–19 పాలసీని రూపొందించడంపై కసరత్తు చేస్తోంది. టీకాల నిల్వలు అందుబాటులో ఉన్న కొద్దీ, స్టాకు వచ్చిన కొద్దీ పంపిణీ చేస్తూ.. కొరత అనే సమస్య తలెత్తకుండా వ్యూహాత్మకంగా వ్యాక్సినేషన్‌ కొనసాగించాలని భావిస్తోంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమాలోచనలు జరిపినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఎక్కువగా జనం మధ్య ఉండేవారిని కేటగిరీలుగా విభజించి టీకాలు వేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సూపర్‌ స్ప్రెడర్లుగా ఉండేవారిని గుర్తించి, ప్రత్యేక వ్యాక్సినేషన్‌ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ సోమవారం నాటి సమీక్షలో పేర్కొన్నారని అధికారవర్గాలు చెప్తున్నాయి. 

మాటిమాటికి ఆపే పని లేకుండా.. 
కోవిడ్‌ చికిత్స, నివారణలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ముందువరుసలో ఉంది. వ్యాక్సినేషన్‌ విషయంలోనూ ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని, ఇందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. వాస్తవానికి ఈ నెల 1వ తేదీ నుంచే 18–45 ఏళ్ల మధ్య వారికి కూడా వ్యాక్సినేషన్‌ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినా.. టీకాల కొరతతో చాలా రాష్ట్రాల్లో ఈ వయసు వారికి టీకాల పంపిణీ జరగడం లేదు. అప్పుడప్పుడు కొద్దికొద్దిగా వస్తున్న టీకాల స్టాకుతో వ్యాక్సినేషన్‌ కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇలా మాటిమాటికి టీకాల పంపిణీ ఆపడం సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త విధానాన్ని అమలు చేయడంపై దృష్టి పెట్టింది. కొద్దిరోజుల పాటు పంపిణీ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది. ప్రస్తుతం స్టాకు ఉన్న మేరకు క్రమపద్ధతిలో టీకాలు ఇస్తూ.. నిరంతరాయంగా కొనసాగించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. 

కేటగిరీలుగా చేసి..  
ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారికి రెండో డోసు టీకాలు వేస్తున్నారు. దీనితోపాటు 45 ఏళ్లు నిండిన వారందరికీ తొలి డోసు మొదలుపెట్టాలని.. 30 ఏళ్లు నిండిన వారిని కేటగిరీలుగా గుర్తించి టీకాలు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో తప్పనిసరిగా బయటికి రావాల్సి ఉన్న రంగాల వారికి తొలుత వ్యాక్సిన్‌ ఇస్తారు. పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేసేవారు, రవాణా, గ్యాస్‌ పంపిణీ, పెట్రోల్‌ బంకుల సిబ్బంది.. వివిధ కేటగిరీలుగా విభజించి ప్రాధాన్యతా క్రమంలో టీకాలు వేస్తారు. ఇదేగాకుండా వ్యాక్సినేషన్‌కు సంబంధించి వైద్యారోగ్య శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుంది. రెగ్యులర్‌గా నిర్వహించే కేంద్రాలతోపాటు మొబైల్‌ కేంద్రాలనూ సిద్ధం చేయనుంది. ఈ మొత్తం ప్రణాళిక సిద్ధంకాగానే.. సీఎం ఆమోదంతో అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. 

నిల్వలు.. 4.53 లక్షల డోసులు  
రాష్ట్రంలో జనవరి 16న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రి య ప్రారంభమైంది. తొలుత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకాలు వేసిన ప్రభుత్వం.. తర్వాత 
60 ఏండ్లు నిండిన వారికి, ఆ తర్వాత 45 ఏళ్లుపైబడిన వారికి పంపిణీ మొదలుపెట్టింది. ఈ నెల 1వ తేదీ నుంచే 18 ఏళ్లు నిండిన అందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినా.. కొరత కారణంగా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 55,26,985 డోసులు పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు వేసుకున్నవారు 44,53,573 మంది ఉండగా... రెండు డోసులూ పూర్తయిన వారు 10,73,412 మంది ఉన్నారు. రాష్ట్రానికి సోమవారం 2.54 లక్షల డోసుల కోవిషీల్డ్‌ టీకాలు వచ్చాయి. వీటితో కలిపి సుమారు 4లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ నిల్వఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇక కోవాగ్జిన్‌ డోసులు 53 వేలు నిల్వ ఉండగా.. మంగళవారం మరో 50 వేల డోసులు రానున్నాయని వివరించారు. కాగా.. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మందికి కోవాగ్జిన్‌ రెండో డోసు ఇవ్వాల్సి ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు