భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌

25 May, 2021 02:13 IST|Sakshi

న్యూస్‌మేకర్‌

కర్ణాటక రాష్ట్రం ఇప్పుడు ఒకందుకు గర్విస్తుంది. భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌ మా రాష్ట్రం నుంచి దేశానికి లభించింది అని ఆ రాష్ట్రం ఆశ్రిత వి. ఓలేటిని చూసి పొంగిపోతోంది. 1973 నుంచి ఎయిర్‌ఫోర్స్‌ నిర్వహిస్తున్న ఈ పరీక్షను కేవలం 275 మంది పాసవ్వగా వారిలో తొలి మహిళగా ఆశ్రిత చరిత్ర సృష్టించింది. ఇకమీద భారతీయ ఎయిర్‌ఫోర్స్‌లో ఏ విమానం కొనాలన్నా, సేవలు మొదలెట్టాలన్నా దానిని పరీక్షించే ఓ.కె చేయాల్సిన బాధ్యత ఆశ్రితదే.

కర్ణాటక రాష్ట్రం కొల్లెగల్‌ కు చెందిన ఆశ్రిత బెంగళూరులో ఇంజినీరింగ్‌ చేసింది. అది విశేషం కాదు. 2014లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ లో చేరి స్క్వాడ్రన్‌ లీడర్‌ అయ్యింది. అది కూడా విశేషం కాదు. కాని ‘ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ టెస్ట్‌ పైలెట్‌ స్కూల్‌’ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ఫ్లయిట్‌ టెస్ట్‌ కోర్స్‌’ (43వ బ్యాచ్‌)లో ఉత్తీర్ణత చెందింది. అదీ విశేషం. ప్రపంచంలో కేవలం 7 మాత్రమే ఉండే ఇలాంటి స్కూల్స్‌లో ఈ కోర్సులో ఉత్తీర్ణత చెందడమే కాకుండా భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్‌ టెస్ట్‌ ఇంజినీర్‌ కావడం ఇంకా పెద్ద విశేషం. ఐ.ఎ.ఎఫ్‌ ఈ విషయాన్ని తన అఫీషియల్‌ ట్విటర్‌ ఖాతాలో ప్రకటించి ఆశ్రితకు అభినందనలు తెలిపింది.

ఇండియన్‌ ఆర్మీలో ప్రస్తుతం 6,807 మంది మహిళా ఆఫీసర్లు పని చేస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో 1607 మంది మహిళా ఆఫీసర్లు పని చేస్తున్నారు. నేవీలో వీరి సంఖ్య 704 మాత్రమే. పురుషులతో పోలిస్తే త్రివిధ దళాలలో స్త్రీ శాతం తక్కువే అయినా ఇటీవల కాలంలో మారిన పరిస్థితుల్లో జెండర్‌ అడ్డంకులు అధిగమించి స్త్రీలు ఆ మూడు సైనిక విభాగాలలో తమ స్థానాన్ని నిరూపించుకుంటున్నారు. 2015 నుంచి ఎయిర్‌ ఫోర్స్‌ తన ఫైటర్‌ విభాగంలో మహిళల ప్రవేశాన్ని ఆమోదించాక సరిగ్గా ఆరేళ్లకు ఆశ్రిత తనదైన ఘనతను సాధించింది.

మరిన్ని వార్తలు