Heavy Rains In Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన.. తగ్గిన ఉష్ణోగ్రతలు

6 Dec, 2023 02:05 IST|Sakshi

రానున్న రెండ్రోజులు తగ్గనున్న ఉష్ణోగ్రతలు 

అశ్వారావుపేటలో 13.1 సెం.మీ వర్షపాతం నమోదు

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన అతి తీవ్ర తుపాను మంగళవారం సాయంత్రం తుపానుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల ప్రాంతంలో తీరం దాటింది. ఆ తర్వాత క్రమంగా బలహీన పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.

రాష్ట్రంలో సగటున 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అశ్వారావుపేటలో ఏకంగా 13.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా దమ్మపల్లి, ముల్కలపల్లి, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. 

ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!
 వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బుధవారం కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు నమోదు కావొచ్చని హెచ్చరించింది. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల నమోదుకు అవకాశం ఉన్నట్లు వివరించింది. 

తగ్గిన ఉష్ణోగ్రతలు 
తుపాను ప్రభావంతో వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. గత రెండ్రోజుల వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 2 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా... మంగళవారం సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధ, గురు వారాల్లో ఇదే తరహాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్‌లో 28.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత హకీంపేట్‌లో 18.7 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. 

వరి, పత్తి పంటలకు నష్టం
♦ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం 
♦ నేల కొండపల్లిలో గుడిసె కూలి భార్యాభర్తలు మృతి 
♦ సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
♦ నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు
సాక్షి నెట్‌వర్క్, ఖమ్మం, నేలకొండపల్లి: తుపాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. సోమవారం సాయంత్రం మొదలైన వాన మంగళవారం తగ్గుముఖం పట్టినా మళ్లీ సాయంత్రం పెరిగింది. రాత్రి పొద్దుపోయే వరకు జిల్లావ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతులు కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. కొన్నిచోట్ల రహదారులపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో విద్యాసంస్థలకు మంగళ, బుధవారాలు సెలవు ప్రకటించారు.

మరోపక్క కలెక్టరేట్లలో కంట్రోల్‌రూంలు ఏర్పాటుచేసిన అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు బోట్లు సమకూర్చడంతో పాటు గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. భద్రాచలానికి 20 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం, పది మందితో కూడిన ఇతర అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యా రు. సింగరేణి ఓసీల్లో నీరు నిలవడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న వర్షం 
రోజంతా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గోడలు నాని పూరిగుడిసె కూలడంతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాధారం గ్రామానికి చెందిన నూకతోటి పుల్లారావు(40) – లక్ష్మి (30) దంపతులు మృత్యువాత పడ్డారు. మట్టిపెళ్లలు మీద పడడంతో అక్కడిక్కడే మృతి చెందారు. అప్పటివరకు చుట్టుపక్కల వారితో మాట్లాడి ఆ దంపతులు ఇంట్లోకి వెళ్లగా.. ఒక్కసారిగా శబ్దం రావటంతో స్థానికులు వెంటనే స్పందించారు.

108కు సమాచారం ఇవ్వగా అక్కడి చేరుకున్న సిబ్బంది అప్పటికే భార్యాభర్తలు మృతి చెందినట్లు నిర్ధారించారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే నిరుపేద దంపతులు అకాల వర్షంతో మృతి చెందడం గ్రామస్తుల్లో విషాదాన్ని నింపింది. 

>
మరిన్ని వార్తలు