Revanth Reddy Political Journey: ‘జెడ్పీటీసీ’ టు సీఎం 

6 Dec, 2023 04:21 IST|Sakshi

ఇదీ రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం

పేరు    :    ఎనుముల రేవంత్‌రెడ్డి 
పుట్టిన తేదీ   :    8–11–1967 
స్వగ్రామం    :    కొండారెడ్డిపల్లి, వంగూరు
                         మండలం (నాగర్‌కర్నూల్‌ జిల్లా) 
చదువు       :    బీఏ 
భార్య         :    గీతారెడ్డి  
కూతురు    :    నైమిష–సత్యనారాయణరెడ్డి (అల్లుడు)

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: విద్యార్థి దశ నుంచే రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి అడుగిడారు. హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆయన బీజేపీ అనుబంధ విభాగమైన ఏబీవీపీతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌లో కూడా చురుగ్గా పనిచేశారు. కొంతకాలం మలక్‌పేటలో ఉన్న ఆయన నారాయణగూడకు మకాం మార్చారు. నారాయణగూడలో మిస్టర్‌ ఆడ్స్‌ పేరుతో ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌ ప్రారంభించారు. రేవంత్‌రెడ్డి క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చాక ప్రింటింగ్‌ ప్రెస్‌ను తమ్ముడు కృష్ణారెడ్డికి అప్పగించారు. కృష్ణారెడ్డి బర్కత్‌పుర డివిజన్‌కు టీడీపీ తరపున ఎంసీహెచ్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు.  

► 2004లో టీఆర్‌ఎస్‌లో చేరి కల్వకుర్తి అసెంబ్లీ సీటు ఆశించారు. అయితే ఆయనకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్క లేదు. 2006లో మిడ్జిల్‌ జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రేవంత్‌రెడ్డి గెలిచారు.  

► 2007లో మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇండిపెండెంట్‌గా రేవంత్‌రెడ్డి గెలవడం అప్ప ట్లో సంచలనమే. అదే ఏడాదిలో టీడీపీలో చేరారు.  

►  2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ సెగ్మెంట్‌కు టీడీపీ తరఫున పోటీచేసిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిని ఓడించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లోనూ కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. 

► 2015 మే 15న రేవంత్‌రెడ్డిని ఓటుకు కోట్లు కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. కూతురి పెళ్లి సమయంలో తనను అరెస్ట్‌ చేయడం పట్ల రేవంత్‌ సీరియస్‌గా స్పందించారు. ‘నీ అంతు చూస్తా.. నిన్ను గద్దె దించడమే నా లక్ష్యం’అంటూ కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. 

► తెలంగాణలో టీడీపీ ప్రాభవం పూర్తిగా కోల్పోవడంతో 2017లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.  

► టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతూ 2018 ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి మూడోసారి బరిలో దిగా డు. పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.  

► 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు.  

► 2021 జూన్‌ 26న అధిష్టానం రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. జూలై 7న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి జరిగిన గ్రేటర్, ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నా.. పట్టుదలతో ముందుకు కదిలి.. ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని సాధించిపెట్టారు.  

► ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున కొడంగల్, కామారెడ్డి సెగ్మెంట్‌లలో రేవంత్‌ పోటీ చేయగా, కామారెడ్డిలో ఓటమిపాలై, కొడంగల్‌లో గెలిచారు.

నాపై గెలిచిన వ్యక్తి నేడు సీఎం.. వెరీ హ్యాపీ 
నాపై పోటీ చేసిన వ్యక్తి నేడు తెలంగాణ సీఎం అవుతుండటం సంతోషంగా ఉంది. 2006లో మిడ్జిల్‌ జెడ్పీటీసీ సభ్యుడిగా నేను కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తే.. రేవంత్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయన సీఎం అవుతున్నారంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. – ఎండీ రబ్బానీ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, మిడ్జిల్‌ మండలం  

>
మరిన్ని వార్తలు