అయ్యో భగవంతుడా.. నీకెవరు దిక్కు

23 Aug, 2021 08:24 IST|Sakshi
అన్యక్రాంతమైన దేవాదాయ భూముల్లో పాతిన బోర్డు వద్ద నాయకులు

వికారాబాద్‌: జిల్లాలోని అనంతపద్మనాభ స్వామి, దొంగఎన్కెపల్లి సంజీవస్వామి, పరిగి మండలంలోని వేణుగోపాల స్వామి, బషీరాబాద్‌ మండల పరిధిలోని మల్కన్‌గిరి ఆంజనేయ స్వామి తదితర ఆలయాలకు సంబంధించి మొత్తం 2,000 ఎకరాల భూములు (ఎండోమెంట్‌)ఉన్నాయి. ఇవి కేవలం రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి. భూముల నమోదుకు సంబంధించి ఎండోమెంట్‌ అధికారులు వినియోగించే ఫామ్‌ వన్‌ రిజిస్టర్‌తో పాటు పర్మినెంట్‌ రిజిస్టర్లలోనూ పొంతనలేని విధంగా భూముల సమాచారం నమోదై ఉందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.

ఆక్రమణల్లో వందల ఎకరాలు  
రెండేళ్ల క్రితం తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో ఎండోమెంట్‌కు సంబంధించి ఇప్పటి వరకు 700 ఎకరాలు మాత్రమే నమోదయ్యాయి. వందల ఎకరాల్లో దేవాదాయ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. తమ కళ్ల ముందే అన్యాక్రాంతమవుతున్నా ఎండోమెంట్‌ అధికారులు చేష్టలుడిగి వ్యవహరిస్తున్నారు. భూముల పరాధీనంపై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు దేవాదాయశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు.

మొత్తం 2,000 ఎకరాల గాను సుమారు 800 ఎకరాలకు పైగా పరాధీనంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పరిగి మండల పరిధిలోని కిష్టమ్మగుడి తండాలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయానికి పూడూరు మండలంలో 14 ఎకరాల భూమి ఉంది. సదరు పొలాన్ని కొందరు తమ పేరున రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇటీల స్థానిక నేతలు ఉద్యమించటంతో ఎండోమెంట్‌ అధికారులు రిజిస్ట్రేషన్‌ రద్దు చేయించి తిరిగి ఆ భూములను ఆలయం పేరున రిజిస్ట్రేషన్‌ చేయించారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు, సహకరించిన అధికారులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

కమిషనర్‌ ఆదేశించినా..  
15 రోజుల క్రితం ఎండోమెంట్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ వికారాబాద్‌కు వచ్చి రెవెన్యూ, ఎండోమెంట్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవాదాయ భూములు, ఇతర ఆస్తుల పరిరక్షణపై ఆయన చర్చించారు. రెవెన్యూ, ఎండోమెంట్‌ అధికారులు సమన్వయంతో పని చేసి మొత్తం భూములు ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. 15 రోజుల పాటు ఈ విషయమై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి పని పూర్తి చేయాలని ఆదేశించారు. గడువు దాటినా సంబంధిత ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పూర్తి వివరాలతో తమ వద్దకు వస్తే ధరణిలో నమోదుకు తాము సిద్ధంగా ఉన్నా మ ని రెవెన్యూ అధికారులు చెబుతుండగా ఎండోమెంట్‌ అధికారుల్లో ఎలాంటి చలనం కనిపించటం లేదు.

చదవండి: అన్నకు ఆనందంగా రాఖీకట్టిన చెల్లెలు.. అంతలోనే..

మరిన్ని వార్తలు