బంజారాహిల్స్‌ పీఎస్‌ ఎదుట హిజ్రాల హంగామా.. వీడియో వైరల్‌

27 Dec, 2022 08:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట హంగామా సృష్టించిన 20 మందికిపైగా హిజ్రాలపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లోని ఇందిరానగర్‌కు చెందిన సోనా రాథోడ్‌ బృందానికి, ఐడీపీఎల్‌ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన మోనాలిసా టీం మధ్య కొద్ది రోజులుగా ఆధిపత్య గొడవలు జరుగుతున్నాయి. సోనా రాథోడ్‌ టీంపై మోనాలిసా దౌర్జన్యానికి పాల్పడుతుండటంతో చర్యలు తీసుకోవాలంటూ వారు ఆదివారం బంజారాహిల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహించడంతోపాటు కిరోసిన్‌ మీద పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

దీంతో పోలీసులు సోనా రాథోడ్‌తోపాటు స్వీటి, చందుబాయి, జోయ, రోషిని, వైశాలి, లక్కీ, పుష్ప తదితర 20 మందికిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్‌ పోలీసులు పరారీలో ఉన్న హిజ్రాలను పట్టుకొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఎస్సై మహేష్‌ ఆధ్వర్యంలో వారికోసం గాలించి పది మంది హిజ్రాలను అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో రోజా, వసు, హిమ, అన్షు, నందు, లక్ష్మి, వైష్ణవి, స్పందన, జోయ, రియా ఉన్నారు. ప్రధాన నిందితురాలు సోనా రాథోడ్, బుల్‌బుల్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా గత కొద్ది కాలంగా హిజ్రాల తీరుపై పోలీసులకు పలు ఫిర్యాదులు అందుతున్నాయి. కూడళ్లతోపాటు ఏదైనా ఫంక్షన్‌ జరిగినా, షాప్‌ ఓపెనింగ్‌ జరిగినా అక్కడికి  వచ్చి వాలుతున్నారని ఫిర్యాదులు అందడం, ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనూ ఇలా వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు హిజ్రాలతోపాటు వారికి సహకరిస్తున్న ఇద్దరు ఆటోవాలాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా హిజ్రాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఒకరిపై ఒకరు దాడులకు దిగడం, పరస్పర ఫిర్యాదులు చేసుకోవడం తలెత్తింది.   
చదవండి: నడిరోడ్డుపై మహిళ ప్రసవం.. మహబూబ్‌నగర్‌లో హృదయవిదారక ఘటన

మరిన్ని వార్తలు