ఒకప్పుడు ముగ్గురూ మిత్రులే.. ఇప్పుడు ముగ్గురూ ప్రత్యర్థులు!

13 Nov, 2023 09:06 IST|Sakshi

తీవ్రస్థాయిలో..  త్రిముఖ పోరు!

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులూ ఉండరు..

బీజెపి అభ్యర్థిగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు,,

హాట్ హాట్‌గా తెలంగాణ పాలిటిక్స్‌!

రాజకీయాలు చిత్ర విచిత్ర మలుపులు..

'రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులూ ఉండరు.  ఈ నానుడికి ఆ నియోజకవర్గం నిలువెత్తు సాక్ష్యంగా మారింది. ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్న ముగ్గురు నేతలు ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండేవారు. తాజా ఎన్నికల్లో మూడు పార్టీల తరపున ఆ ముగ్గురే పోటీ చేస్తున్నారు. త్రిముఖ పోరు తీవ్రస్థాయిలో జరుగుతున్న ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ నాయకులు ఎవరు?'

అసెంబ్లీ ఎన్నికల కాలంలో తెలంగాణ పాలిటిక్స్‌ హాట్ హాట్‌గా సాగుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ.. శాశ్వత శత్రువులూ ఉండరని అంటారు. నిన్న మిత్రులుగా ఉన్న వారు ఇప్పుడు ప్రత్యర్ధులుగా మారి ఉండొచ్చు. ప్రత్యర్ధులు ఏకతాటిపైకి వచ్చి ఉండొచ్చు. ఇప్పటి తరం నాయకులు ఒకే పార్టీని పట్టుకుని వేలాడటంలేదు. పొద్దున టిక్కెట్ రాలేదంటే సాయంత్రానికి కండువా మార్చేస్తున్నారు. సాయంత్రం టికెట్ ఇస్తానంటే ఉదయానికి పార్టీ మార్చేస్తున్నారు. జెండాలు, రంగులు మార్చేయడం చాలా ఈజీగా మారిపోయింది. రాజకీయ కమిట్మెంట్, కేడర్ పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉండడం ఒకప్పటి మాట. ఇప్పుడంతా అధికారం, పదవి ముఖ్యం అన్నట్లుగా పార్టీలు మార్చేస్తున్నారు.

గులాబీ పార్టీలో కొనసాగి.. ఇప్పుడు చెరోదారి!
హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయాలు చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు బరిలో ఉన్నారు. 2014లో ఈ ముగ్గురు నాయకులు గులాబీ పార్టీలో కొనసాగారు.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పరకాల ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా  విజయం సాధించి 2018 వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తర్వాత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్ళీ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బీఆర్ఎస్ తరపున వరంగల్‌ నగరంలో కార్పొరేటర్‌గా గెలిచిన నన్నపునేని నరేందర్‌ను మేయర్ పదవి వరించింది. గత ఎన్నికల్లో నరేందర్‌ వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు.

కారు దిగి కమలం గూటికి..
2014 ఎన్నికలకు ముందు తెలంగాణ సాధన సమితిలో సాగిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యేగా కొండా సురేఖ, కార్పొరేటర్ గా నరేందర్ ఎన్నికల్లో గెలిచేందుకు తన వంతు సహకారం అందించారు. 2018లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రదీప్ రావును ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ ఆయన ఆశలపై గులాబీ పార్టీ అధిష్టానం నీళ్ళు చల్లింది. నన్నపునేని నరేందర్కు టికెట్ ఇవ్వడంతో ప్రదీప్‌రావు నిరుత్సాహం చెందారు. నీకు మంచి గుర్తింపు ఇస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇవ్వడంతో అప్పుడు ఎన్నికల్లో తప్పుకున్నారు. ఆ తర్వాత పార్టీలో గుర్తింపు లేకపోవడం, ఎలాంటి పదవులు రాకపోవడంతో.. కొన్ని నెలల క్రితం కారు దిగి కమలం గూటికి చేరారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండ సురేఖ, బీజెపి అభ్యర్థిగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్నపునేని నరేందర్ బరిలో ఉన్నారు. 2018 ఎన్నికల వరకు వీరంతా ఒకే పార్టీలో పనిచేసి.. ఒకే స్టేజి పైన కూర్చున్నారు. ఇప్పుడు నన్నపునేని గులాబీ నీడనే ఉండగా.. కొండా సురేఖ, ప్రదీప్‌రావు జెండాలు మార్చారు. ఒకే నియోజకవర్గంలో ముగ్గురూ ప్రత్యర్థులుగా మారి పోటీ పడుతున్నారు. ఒకప్పుడు ముగ్గురూ మిత్రులే.. ఇప్పుడు ముగ్గురూ ప్రత్యర్థులు. మరి వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూడాలి.
ఇవి చదవండి: 'హస్తం'లో.. చివరి నిమిషం వరకు.. వీడని నామినేషన్ల గందరగోళం!

మరిన్ని వార్తలు