టీఆర్‌ఎస్‌‌ అభ్యర్థిగా ‘నోముల భగత్’‌

30 Mar, 2021 02:32 IST|Sakshi

బీ ఫామ్‌ అందజేసిన పార్టీ అధినేత కేసీఆర్‌

ప్రచార ఖర్చు కోసం రూ. 28 లక్షల చెక్కు కూడా.. 

నేడు నాగార్జున సాగర్‌ స్థానానికి నామినేషన్‌ వేయనున్న భగత్‌ 

ఆశావహులు కోటిరెడ్డి, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డికి సీఎం బుజ్జగింపు 

పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపు 

మంచి మెజారిటీతో గెలవడం ఖాయమని స్పష్టీకరణ 

ప్రచారానికి కేసీఆర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నోముల భగత్‌ను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. భగత్‌కు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం బీ ఫామ్‌ను అందజేయడంతో పాటు ఎన్నికల ప్రచారం కోసం రూ.28 లక్షల చెక్కును కూడా కేసీఆర్‌ అందజేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు భగత్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మంగళవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనున్న నేపథ్యంలో దివంగత శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య కుమారుడైన భగత్‌ను పార్టీ అభ్యర్థిగా కేసీఆర్‌ ఎంపిక చేశారు. తెలంగాణ భవన్‌కు సోమవారం మధ్యాహ్నం చేరుకున్న ముఖ్యమంత్రి.. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్‌కుమార్‌ రెడ్డి తదితరుల సమక్షంలో భగత్‌కు బీ ఫామ్‌ అందజేశారు.

ఈ సందర్భంగా భగత్‌ తల్లి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కేసీఆర్‌ సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. ‘నోముల నర్సింహయ్యతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కుమారుడికి అవకాశం ఇస్తున్నాం. గతంలో మాదిరిగా కాకుండా పార్టీ నేతలందరూ కలసికట్టుగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలి. నేను కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా’అని చెప్పారు.  

కోటిరెడ్డి, చిన్నపరెడ్డితో భేటీ 
సాగర్‌ టికెట్‌ ఆశించిన పార్టీ నేతలు ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ప్రగతిభవన్‌కు వెళ్లారు. కోటిరెడ్డి, చిన్నపరెడ్డితో వేర్వేరుగా సమావేశమైన కేసీఆర్‌ వారిద్దరినీ బుజ్జగించినట్లు సమాచారం. ‘నాగార్జునసాగర్‌లో పార్టీ గెలిచేందుకు బాధ్యత తీసుకోండి. మీరు స్థానికంగా కష్టపడి పనిచేస్తున్నా కొన్ని పరిస్థితుల్లో అవకాశం ఇవ్వలేక పోతున్నా. భవిష్యత్తులో రాజకీయంగా అనేక అవకాశాలు ఉంటాయి. ఈ ఏడాది మేలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో మీకు శాసనమండలి సభ్యుడిగా అవకాశం ఇస్తా..’అని కోటిరెడ్డికి సీఎం హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా కింద మరోసారి అవకాశం ఇస్తానని చిన్నప రెడ్డికి నచ్చజెప్పారు.

వారితో కలసి భోజనం చేసిన అనంతరం కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు వెళ్లారు. భగత్‌కు బీ ఫామ్‌ అందజేసిన తర్వాత పార్టీ నేతలందరూ కలసికట్టుగా పని చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. ‘టికెట్‌ ఆశించిన నేతలను కూడా కలుపుకొని పార్టీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లాలి. అలాగే ఈ టికెట్‌ ఆశించినవారు కూడా మనసులో ఇతర అభిప్రాయాలకు తావులేకుండా పనిచేయాలి..’ అని సూచించారు. బీజేపీకి అక్కడ సొంత బలం లేనందునే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటన వచ్చేవరకు వేచి చూస్తోందన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ పరంగా సర్వేలు చేయించామని, సాగర్‌లో మంచి మెజారిటీతో గెలుస్తున్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఈ సందర్భంగా నోముల నర్సింహయ్య భార్య లక్ష్మిని వారి కుటుంబ బాగోగులను కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. 

సామాజికవర్గ సమీకరణాలతోనే భగత్‌కు 
సాగర్‌ నియోజకవర్గం పరిధిలో 2.17 లక్షల ఓటర్లు ఉండగా, వీరిలో 34 వేల మందికి పైగా బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2014, 2018 ఎన్నికల్లో ఇదే సామాజిక వర్గానికి చెందిన నోముల నర్సింహయ్యకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. నర్సింహయ్య హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరుగుతుండగా.. ఆయన స్థానంలో దుబ్బాక తరహాలోనే ఆయన కుమారుడు భగత్‌కు అవకాశం ఇచ్చారు. నర్సింహయ్య పట్ల ఉన్న సానుభూతి కూడా కలసి వస్తుందని టీఆర్‌ఎస్‌ అంచనా వేసింది. ఓటర్ల సంఖ్యా పరంగా లంబాడాలు 38 వేలు, రెడ్డి 23 వేలు, మాదిగ 26 వేలు, ముదిరాజ్‌ 12 వేలకు పైగా ఉండటంతో పార్టీ ఇన్‌చార్జీలుగా అదే సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ మోహరించి ప్రచారం నిర్వహిస్తోంది. 

ఇక జోరుగా ప్రచారం 
ఉప ఎన్నిక పోలింగ్‌ ఏప్రిల్‌ 17న జరగనుండగా వచ్చే పక్షం రోజులు ప్రచారాన్ని హోరెత్తించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. గత నెల 10న హాలియాలో జరిగిన సభలో పాల్గొన్న కేసీఆర్‌.. ఈసారి త్రిపురారం లేదా నాగార్జునసాగర్‌ మున్సిపాలిటీలో నిర్వహించే బహిరంగ సభకు హజరవుతారని, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు రోడ్‌ షోల్లో పాల్గొంటారని సమాచారం. వీరిద్దరి ప్రచార సభలు, రోడ్‌ షోల షెడ్యూలు ఖరారు కావాల్సి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, జాజుల సురేందర్‌ (తిరుమలగిరి మండలం), కోరుకంటి చందర్‌ (హాలియా), బాల్క సుమన్‌ (పెద్దవూర), కంచర్ల భూపాల్‌రెడ్డి (గుర్రంపోడ్‌), నల్లమోతు భాస్కర్‌రావు (నిడమనూరు), భానోత్‌ శంకర్‌ నాయక్‌ (త్రిపురారం) కోనేరు కోణప్ప (అనుముల), జీవన్‌రెడ్డి (మాడ్గుపల్లి) ఇన్‌చార్జీలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, సుడా (కరీంనగర్‌) చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు ప్రచారాన్ని సమన్వయం చేస్తున్నారు.

నాన్న ఆశయాలు నెరవేరుస్తా: భగత్‌ 
‘నాన్న నోముల నర్సింహయ్య 2014లో టీఆర్‌ఎస్‌లో చేరిన నాటి నుంచి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆయనకు సముచిత స్థానం కల్పించారు. కేసీఆర్‌ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలే నర్సింహయ్యను గెలిపించాయి. ఆయన వారసుడిగా ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తా..’అని భగత్‌ అన్నారు. బీ ఫామ్‌ అందుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండేళ్ల లోపే మా నాన్నను కోల్పోయి ఉప ఎన్నిక రావడం దురదృష్టకరం. అయితే నా మీద నమ్మకముంచి టికెట్‌ కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా’ అని భగత్‌ అన్నారు. నర్సింహయ్య వారసుడిగా ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. 

పేరు : నోముల భగత్‌ 
తండ్రి : దివంగత నోముల నర్సింహయ్య  
తల్లి : నోముల లక్ష్మి
ప్రస్తుత నివాసం: హాలియా
పుట్టిన తేదీ: 10–10–1984  
భార్య : నోముల భవానీ  
పిల్లలు: రానాజయ్, రేయాశ్రీ 
విద్యార్హతలు: బీఈ, ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం  చేసిన ఉద్యోగాలు: సత్యం టెక్నాలజీస్‌ లిమిటెడ్‌లో జూనియర్‌ ఇంజనీర్, (2010–2012), విస్టా ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌లో మేనేజర్‌  
ప్రస్తుతం : హైకోర్టు న్యాయవాది, నోముల ఎన్‌ఎల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌  

మరిన్ని వార్తలు