Vemulawada: తుల ఉమకు బీజేపీ షాక్‌.. వికాస్‌ రావుకే బీ-ఫామ్‌

10 Nov, 2023 12:37 IST|Sakshi

సాక్షి, వేములవాడ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు, నేతలు వేగం పెంచారు. నామినేషన్ల స్వీకరణకు నేడు(శుక్రవారం) చివరి తేదీ కావడంతో నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వేములవాడ బీజేపీలో కోల్డ్‌ వార్‌ జరుగుతోంది. ఒకే అసెంబ్లీ స్థానానికి ఇద్దరు బీజేపీ నేతలు పోటాపోటీ నామినేషన్లు వేశారు.

వేములవాడ అసెంబ్లీకి బీజేపీ పార్టీ తరుపున తుల ఉమ శుక్రవారం నామినేషన్‌ వేశారు. అయితే కమలం పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావు తరపున ఆయన వర్గీయులు నామినేషన్‌ వేయడం ఆసక్తికరంగా మారింది. వేములవాడ బీజేపీ రెండు గ్రూప్‌లుగా చీలిపోవడంతో నేతల మధ్య టికెట్‌ ఫైట్‌ ఉత్కంఠ రేపుతోంది.

తుల ఉమకు షాక్‌.. వికాస్‌ రావుకే బీఫామ్‌
వేమలవాడ బీజేపీలో ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. తుల ఉమను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన బీజేపీ.. చివరికి ఆమెకు మొండిచేయి చూపింది. మరికొద్ది గంటల్లో నామినేషన్‌ ప్రక్రియ ముగియనున్న సమయంలో వేమలవాడ అభ్యర్థిగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావుకు  బీ-ఫామ్‌ అందించింది. దీంతో తనే బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నానని ఆశించిన తుల ఉమకు ఆఖరి క్షణంలో భంగపాటు తప్పలేదు. అదే విధంగా సంగారెడ్డిలో బీజేపీ తమ అభ్యర్థిని మార్చింది. ముందుగా ప్రకటించిన రాజేశ్వరరావు దేశ్‌పాండేకు కాకుండా  పులిమామిడి రాజుకు బీ-ఫామ్‌ అందజేసింది.

చదవండి: తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌ 

మరిన్ని వార్తలు