గవర్నర్‌ లేకుండానే బడ్జెట్‌కు సై!

1 Mar, 2022 07:50 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

7 నుంచి రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు 

స్పీకర్‌ ఆధ్వర్యంలోనే ప్రారంభం.. నోటిఫికేషన్‌ విడుదల 

తొలిరోజునే అసెంబ్లీ, మండలి ఎదుటకు బడ్జెట్‌! 

గత సమావేశాలు ప్రొరోగ్‌ కానందునే గవర్నర్‌ ప్రసంగానికి నో చాన్స్‌! 

నేరుగా ప్రారంభించేందుకు స్పీకర్‌కు అధికారం 

1970, 2014లోనూ ఇలాగే మొదలైన ఉమ్మడి ఏపీ అసెంబ్లీ సమావేశాలు 

ఇతర రాష్ట్రాల్లోనూ పలు ఉదంతాలు ఉన్నాయంటున్న ప్రభుత్వ వర్గాలు 

సాక్షి, హైదరాబాద్‌:   రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగం లేకుండానే 2022–23 బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఈ నెల 7న ఉదయం 11.30కు శాసనసభ, మండలి వేర్వేరుగా ప్రారంభమవుతాయని పేర్కొంటూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం అసెంబ్లీ, మండలి సమావేశాల ప్రారంభం తేదీని సూచిస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఉభయ సభల సభ్యులకు లేఖలు రాశారు. 
ఏడో తేదీనే బడ్జెట్‌..: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్‌లో  సమావేశమై రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆమోదించనుంది. ఇక బడ్జెట్‌ సమావేశాలను ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనే దానిపై.. 7న స్పీకర్‌ అధ్యక్షతన జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించనున్నారు. సమావేశాల తొలిరోజునే శాసనసభ, మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్టు సమాచారం. ఈ నెల 24 వరకు సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 

ప్రోరోగ్‌ కాకపోవడంతోనే.. 
అసెంబ్లీ, మండలి సమావేశాల నిర్వహణ నిరంతరం జరిగే రాజ్యాంగ ప్రక్రియ. కనీసం ప్రతి ఆరు నెలలకోసారి తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. అవి ముగిసిన ప్రతిసారి ప్రోరోగ్‌ (ముగిసినట్టుగా అధికారిక ప్రకటన) చేస్తుంటారు. ఒకవేళ ప్రోరోగ్‌ చేయకుంటే.. అసెంబ్లీ, మండలి సమావేశాలు కేవలం వాయిదా పడినట్టు మాత్రమే పరిగణించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏదైనా ఆర్డినెన్సులు జారీ చేయడానికిగానీ, చట్టాల్లో సవరణలు చేయడానికిగానీ వీలుండదు. వాటికి అసెంబ్లీ, మండలి ఆమోదం తీసుకోవాల్సి వస్తుంది. అదే ప్రోరోగ్‌ చేస్తే.. ప్రభుత్వమే నేరుగా చట్ట సవరణలు, ఇతర అంశాలపై ఆర్డినెన్సులు జారీ చేయవచ్చు. ఈ కారణంతోనే దాదాపు అన్ని సందర్భాల్లో అసెంబ్లీ, మండలి సమావేశాలను ప్రోరోగ్‌ చేస్తుంటారు. ప్రోరోగ్‌ చేసిన తర్వాత మళ్లీ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలంటే.. గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోరోగ్‌ చేయకుంటే.. నేరుగా సమావేశాలను ప్రారంభించే అధికారం అసెంబ్లీ స్పీకర్‌కు ఉంటుందని నిబంధనలు చెప్తున్నాయి. 

స్పీకర్‌ అధికారంతో.. 
గత ఏడాది సెప్టెంబర్‌–అక్టోబర్‌లో జరిగిన శాసనసభ 8వ విడత సమావేశాలు అక్టోబర్‌ 8న ప్రోరోగ్‌ కాకుండానే ముగిశాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7న ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాలను శాసనసభ స్పీకర్‌ ప్రారంభించనున్నారు. అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం లేనందున.. గవర్నర్‌ ప్రసంగం కూడా ఉండే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

ఇలా జరగడం అరుదే.. 
రాష్ట్ర గవర్నర్‌ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగడం చాలా అరుదైన విషయం. 1970, 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తరహాలో గవర్నర్‌ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌ 2020–21 వార్షిక బడ్జెట్‌ సమావేశాలు కూడా గవర్నర్‌ ప్రసంగం లేకుండానే నడవగా.. పుదుచ్చేరి గవర్నర్‌గా పనిచేసిన కిరణ్‌బేడీ కూడా గతంలో ప్రసంగాన్ని స్వయంగా బహిష్కరించారని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను గవర్నర్‌ ప్రసంగం లేకుండానే నిర్వహిస్తున్నట్టు చెప్తున్నాయి. కాగా.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై జరిగిన భేటీలో వైద్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతోపాటు ఆర్థికశాఖ కార్యదర్శి, సీఎం కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
చదవండి: వాహనదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు.. బంఫర్‌ ఆఫర్‌ 30 రోజులే!

మరిన్ని వార్తలు