మెడికల్‌ కాలేజీల్లో కౌన్సెలింగ్‌ కేంద్రాలు

27 Feb, 2023 01:39 IST|Sakshi

ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనల నివారణే లక్ష్యం 

వైద్య విద్యార్థుల ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం 

విద్యార్థులకు యోగా తప్పనిసరి చేయాలని ఇప్పటికే కేంద్రం ఆదేశం 

విద్యార్థులకు ఇచ్చిన పనిగంటలు, వీక్లీ ఆఫ్‌ వివరాలను అందించాలని ఎన్‌ఎంసీ ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: కాకతీయ మెడికల్‌ కాలేజీ ఎండీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం... నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యార్థి ఆత్మహత్య.. ఖమ్మం జిల్లాకు చెందిన మెడికల్‌ విద్యార్థి విజయవాడలో ఆత్మహత్య ఘటనలు ఈ ఐదారు రోజుల్లో యావత్‌ సమాజాన్ని కుదిపేశాయి. మెడికల్‌ కాలేజీల్లో అసలేం జరుగుతోందని ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.

వైద్య, ఆరోగ్య శాఖ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించింది. వేధింపులు, పరీక్షల ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో వైద్య విద్యార్థుల ఆత్మహత్యలు, యత్నాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో తక్షణమే కౌన్సెలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడే విద్యార్థులకు కౌన్సెలింగ్‌ చేయాలని నిర్ణయించింది.

విద్యార్థుల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే తక్షణమే వాటిని పరిష్కరించాలని స్పష్టం చేసింది. ఫిర్యాదులను తమకు పంపించాలని, అందుకు తీసుకున్న చర్యలేంటో తెలియజేయాలని పేర్కొంది. ఇంటర్న్‌షిప్‌ విద్యార్థులకు, పీజీ మెడికల్‌ విద్యార్థులతో ఎన్ని గంటలు పనిచేయిస్తున్నారు? అదనపు గంటలు పనిచేయిస్తున్నారా? వీక్లీ ఆఫ్‌లు ఇస్తున్నారా? వంటి అంశాలపై సమగ్ర సమాచారం పంపాలని ఆదేశించింది.

చాలా మెడికల్‌ కాలేజీలు, బోధనాసుపత్రుల్లోనూ పీజీ మెడికల్‌ విద్యార్థులపై సీనియర్‌ డాక్టర్లు పనిభారం వేస్తూ వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు సీనియర్‌ డాక్టర్లు పీజీలతో పనిచేయించుకుంటూ తమ సొంత ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి వారి వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

24 గంటల హెల్ప్‌లైన్‌.. 
అన్ని వైద్య కళాశాలల్లో తప్పనిసరిగా 24 గంటల హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని, డీన్‌ లేదా ప్రిన్సిపాల్‌ అధ్యక్షతన ఒక అంతర్గత ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని, కాలేజీల్లో ఆత్మహత్యల నివారణ కోసం సైకియాట్రీ సీనియర్‌ ప్రొఫెసర్‌ను సభ్యుడిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆపదలో ఉన్నవారు లేదా ఆత్మహత్య చేసుకొనే ధోరణి ఉన్నవారు సొసైటీ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ – 011–4076 9002 నంబర్‌కు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఫోన్‌ చేయవచ్చని జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సూచించింది.

గత ఐదేళ్లలో ఆత్మహత్యలకు పాల్పడిన వైద్య విద్యార్థుల వివరాలను, మధ్యలోనే చదువు మానేసిన విద్యార్థుల వివరాలను పంపించాలని ఎన్‌ఎంసీ కోరింది. ప్రతి మెడికల్‌ కాలేజీలోనూ విద్యార్థులకు యోగా, ధ్యానం తప్పనిసరి చేయాలని సూచించింది. ఆత్మహత్యల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసిన ఎన్‌ఎంసీ.. ఇలాంటి ఘటనలకు ర్యాగింగ్‌తో సంబంధం లేనప్పటికీ చాలా సందర్భాల్లో ర్యాగింగ్‌ వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయని భావిస్తోంది.

వాటిపై సమీక్షించాల్సిన అవసరముందంటున్నారు. ‘ప్రతి ఒక్కరి జీవితం విలువైనది. విద్యార్థులు సురక్షితంగా చదువుకొనేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తాం. అందుకోసం ఎన్‌ఎంసీ సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. విద్యార్థుల్లో ఒత్తిడి, వేధింపులతో ఆత్మహత్యల వంటి ఘటనలను నిరోధించడానికి కౌన్సెలింగ్, ఇతర సహాయక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలి’అని ఎన్‌ఎంసీ కోరింది. ఆ ప్రకారం రాష్ట్రంలో చర్యలు చేపడుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.   

>
మరిన్ని వార్తలు