హైదరాబాద్‌ వర్సిటీకి  అరుదైన గౌరవం

7 Jan, 2021 08:16 IST|Sakshi

ప్రతిష్టాత్మక బిల్, మెలిండా గేట్స్‌ రీసెర్చి గ్రాంట్‌కు ఎంపిక

సాక్షి హైదరాబాద్, రాయదుర్గం: ప్రసవ సమయంలో ఆచితూచి సిజేరియన్‌ ఆపరేషన్లు (సీ సెక్షన్‌) చేసే అంశంపై ప్రతిష్టాత్మక బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ రీసెర్చి గ్రాంట్‌ కోసం యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూవోహెచ్‌) స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, హైదరాబాద్‌లోని ఫెర్నాండెజ్‌ ఫౌండేషన్‌ను భాగస్వాములుగా గుర్తించారు. యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ లాంకషైర్‌ (యూసీలాన్‌) ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ ప్రొ. సూ డౌనీ ఈ రెండు సంస్థలను ఎంపికచేశారు. గ్లోబల్‌ నెట్‌వర్క్‌లో భాగంగా బ్రెజిల్, కెనడాలలో రీ–జెడ్జ్‌ అనే వినూత్న ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు జెనీవాలోని డబ్ల్యూహెచ్‌వోతో కలిసి హైదరాబాద్‌ వర్సిటీ పనిచేస్తోంది. ‘రెడ్యూసింగ్‌ రేట్స్‌ ఆఫ్‌ నాన్‌–మెడికల్లీ ఇండికేటెడ్‌ సిజేరియన్‌ సెక్షన్స్‌ త్రూ ఓపెన్‌ యాక్సెస్‌ మల్టీ ఎవిడెన్స్‌ అండ్‌ బిహేవియర్‌ చేంజ్‌ ప్రోగ్రాం ఫర్‌ లాయర్స్‌ అండ్‌ జడ్జెస్‌’ వంటి అంశాలపై ఈ ప్రాజెక్ట్‌ దృష్టి సారించనుంది.

ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న ఐదు ప్రాజెక్టుల్లో ఇదొక ప్రాజెక్ట్‌ కాగా, వాటిలో 120 దరఖాస్తులకు 80 వేల డాలర్ల విలువైన బిల్, మెలిండా గేట్స్‌ రీసెర్చి గ్రాంట్‌ అవార్డు లభించనుంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రధానంగా యూసీ లాన్, వర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ఫెర్నాండేజ్‌ ఫౌండేషన్‌ అమలు చేయనున్నాయి. దీనికి సంబంధించిన మల్టీ మీడియా ప్రోగ్రామ్స్‌ పూర్తయ్యాక వాటిని భారత్‌లోని నాలుగు రాష్ట్రాల్లోని జడ్జీలు, లాయర్లకు అందజేస్తారు. వీటిని ఏ మేరకు ఉపయోగించవచ్చు, సిజేరియన్‌ ఆపరేషన్ల కారణంగా ఉత్పన్నమయ్యే కేసుల్లో తలెత్తే న్యాయపరమైన అంశాలు, వాటిపై తీసుకోవాల్సిన నిర్ణయాలను గురించి ఈ జడ్జీలు, న్యాయవాదులు పరిశీలిస్తారు.

హైదరాబాద్‌ వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌æ పరిశోధకుల సేవలను వీసీ ప్రొఫెసర్‌ పి.అప్పారావు ప్రశంసిస్తూ, ప్రతిష్టాత్మకమైన భాగస్వామ్యానికి ఎంపిక కావడం ద్వారా తమ వర్సిటీ అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా తన ప్రతిష్టను నిలుపుకుంటుందన్నారు. తమ పరిశోధక బృందాన్ని హైదరాబాద్‌ వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ డీన్‌ ప్రొ.పి.ప్రకాశ్‌బాబు అభినందించారు. ప్రతిష్టాత్మక ఈ రీసెర్చి గ్రాంట్‌ కోసం యూఓహెచ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ తరఫున దరఖాస్తుదారుగా ఉన్న ఫ్యాకల్టీ డా.బీఆర్‌ శమన్న ఈ అధ్యయనం పట్ల తాము ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. సిజేరియన్‌ ఆపరేషన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై తమ పరిశోధనలు ప్రభావం చూపిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.   

మరిన్ని వార్తలు