వసతులు, సౌకర్యాలపై బిల్డర్లు దృష్టి సారించాలి

27 Aug, 2023 02:12 IST|Sakshi
బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు తదితరులు

ధరలు అందుబాటులో ఉంటేనే అందరికీ ఇళ్లు

నరెడ్కో రజతోత్సవాల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు  

సాక్షి, హైదరాబాద్‌: ‘దేశంలో భూమి లభ్యత పరిమితంగా ఉండటంతో డెవలపర్లు ఎత్తయిన నిర్మాణాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. భవనాల ఎత్తు పెరిగే కొద్దీ సమస్యలు ఉంటాయి. అందుకే ఎత్తు మాత్రమే కొలమానం కాకుండా సౌకర్యాలు, వస­తులు కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేప­ట్టాలి’అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయు­డు డెవలపర్లకు సూచించారు.

హైదరాబాద్‌లో శనివారం నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నరెడ్కో) రజతోత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథిగా వెంకయ్య­నాయుడు మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధమైన రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి కోసం కేంద్రం రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నా...ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు రెరా ప్రతినిధులను నియమించకపోవటం శోచనీయమన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్, ఎయిర్‌వేస్, హైవేస్, రైల్వేస్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం.. వెరసి హైదరాబాద్‌ హ్యాపెనింగ్‌ సిటీ అని వెంకయ్య కొనియాడారు. చంద్రుడిపై ఇళ్లు కట్టే స్థాయికి నరెడ్కో ఎదుగుతుందని ఛలోక్తి విసిరారు.  

సమర్థ నాయకుడితోనే అభివృద్ధి: వేముల 
స్థిర, సమర్థవంతమైన నాయకుడితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెరుగైన మౌలిక వసతులు, శాంతి భద్రతలు బాగున్న చోట పెట్టుబడులు వాటంతటవే వస్తాయని ఈ విషయంలో హైదరాబాద్‌ ముందున్నదని చెప్పారు.  కార్యక్రమంలో నరెడ్కో జాతీయ అధ్యక్షుడు రజన్‌ బండేల్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు