ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్, ఐపీఎస్‌లపై హైకోర్టులో తుది విచారణ.. తీర్పుపై ఉత్కంఠ

20 Nov, 2023 11:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. క్యాట్‌ తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన 12 మంది అధికారులకు సంబంధించిన పిటిషన్‌పై తుది విచారణ జరుపుతోంది. గతంలో సోమేష్‌ కుమార్‌ విషయంలో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని ఎన్నికలు కమిషన్‌ వాదిస్తోంది.  హైకోర్టులో తుది విచారణ జరుగుతుండటంతో తీర్పు ఎలా వస్తుందన్న దానిపై ఐఏఎస్ఉ‌, ఐపీఎస్‌ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కాగా ఏపీ విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 376 మంది ఐఏఎస్‌, 258 మంది ఐపీఎస్‌, 149 ఐఎఫ్‌ఎస్‌ అధికారులను ప్రత్యూష్‌ సిన్హా కమిటీ రెండు రాష్ట్రాలకు పంపకాలు చేసింది.  పునర్విభజన తర్వాత ఏపీకి వెళ్లేందుకు కొంతమంది అధికారులు ఇష్టపడటం లేదు. క్యాట్‌ తీర్పును అడ్డుపెట్టుకొని తెలంగాణలోనే పనిచేస్తున్నారు. వాస్తవానికి రూల్ 5(1) ప్రకారం ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒప్పంద  పత్రం రాసి ఉంటారు.

అయితే తెలంగాణలో కొంతమంది అధికారులు ఏపీకి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. క్యాట్‌ తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2017లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసింది. దీనిపై జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌, జస్టిస్‌ అనిల్‌ కుమార్‌ బెంచ్‌ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 

ఏపీకి వెళ్లని ఐఏఎస్‌ల జాబితాలో  హరికిరణ్‌, అనంతరామ్‌, మల్లెల ప్రశాంతి, వాకాటి కరుణ, శివశంకర్‌ లోహితి, ఎస్‌,ఎస్‌ రావత్‌, గుమ్మల శ్రీజన, రోనాల్డ్‌ రాస్‌, వాణి ప్రసాదా్‌, డిప్యూటేషన్‌పై సెంట్రల్‌ బిష్టా ఉన్నారు. ఆమ్రాపాలి, అబిలాష్‌ బిస్టా డిప్యూటేషన్‌పై కేంద్రంలో పనిచేస్తున్నారు. ఏపీకి వెళ్లని ఐపీఎస్‌ల జాబితాలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌ కూడా ఉన్నారు. 
చదవండి: నేడు మరోసారి రాష్ట్రానికి అమిత్‌ షా.. మూడుచోట్ల ప్రసంగం

గతంలో హైకోర్టు తీర్పుతో సోమేష్‌ కుమార్‌ ఏపీకి వెళ్లారు. అక్కడ జాయిన్‌ అయి ముందస్తు రాజీనామా చేసి హైదరాబాద్‌కు వచ్చేశారు. సోమేష్‌ కుమార్‌ తీర్పుకు భిన్నంగా అభిషేక్‌ మహంతి కేసు ఉంది. ఉమ్మడి ఏపీ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా యువ ఐపీఎస్‌ అధికారి అభిషేక్ మహంతిని కేంద్రం ఏపీకి కేటాయించింది. తనను తెలంగాణ కేడర్‌కి కేటాయించాలని ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన పరిపాలన ట్రిబ్యునల్ అభిషేక్ మహంతిని తెలంగాణకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఏపీకి.. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణకు క్యాట్ ఆదేశాలిచ్చింది. క్యాట్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం మహంతిని రిలీవ్ చేయగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆయనను విధుల్లోకి తీసుకోకుండా తాత్సారం చేసింది. ఈ వ్యవహారంపై మహంతి మరోమారు ట్రిబ్యునల్‌కి వెళ్లారు. క్యాట్ ఆదేశాలు అమలు చేయలేదంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌పై ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ జరిపిన న్యాయస్థానం క్యాట్ ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తూ.. అభిషేక్ మహంతికి తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని  గతంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలిచ్చింది. చాలాకాలంపాటు పోస్టింగ్‌ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కరీంనగర్‌ సీపీగా బాధ్యతలు అప్పగించింది.

నేడు తుది వాదనల తర్వాత తీర్పు ఎన్నికలలోపు వస్తుందా? రాదా.. ఎన్నికల కమిషన్‌ హైకోర్టుకు ఎలాంటి వాదనలు వినిపిస్తుందోనని ఆసక్తిగా మారింది. సోమేష్‌ కుమార్‌కు తీర్పుఇచ్చేనట్లు తీర్పు వస్తే 12 మంది ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు