ఒమిక్రాన్‌ బాధితుడి ఇంట రెండు పాజిటివ్‌ కేసులు.. అక్కడ లాక్‌డౌన్‌

23 Dec, 2021 14:09 IST|Sakshi

సాక్షి, ముస్తాబాద్‌ (సిరిసిల్ల): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైన గూడెంలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వేరియంట్‌ నిర్ధారణకు నమూనాలను హైదరాబాద్‌కు పంపించారు. గూడేనికి చెందిన పిట్టల చందు ఈ నెల 16న దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో పరీక్ష చేయించుకోగా ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిన సంగతి విదితమే. దీంతో జిల్లా వైద్యాధికారి, మండల వైద్యాధికారి అప్రమత్తమై.. సదరు వ్యక్తితో కాంటాక్టు అయిన 16 మందిని హోమ్‌ క్వారంటైన్‌ చేశారు.

వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా అతని భార్య, తల్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి సంజీవ్‌రెడ్డి బుధవారం తెలిపారు. ప్రస్తుతం వీరికి స్థానికంగా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. గూడెంలో ఒమిక్రాన్‌ నమోదవడం, మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రావడంతో లాక్‌డౌన్‌ విధించనున్నట్లు పంచాయతీ పాలకవర్గం తెలిపింది. గూడెంలో ఇప్పటికే దుకాణాలు, హోటళ్లు, బడులు మూసివేశామంది. మరో పది రోజులపాటు గ్రామంలోకి ఎవరూ రాకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది. 

హయత్‌నగర్‌లో ఒమిక్రాన్‌ 
హయత్‌నగర్‌:
హయత్‌నగర్‌ డివిజన్‌లో ఒమిక్రాన్‌ కేసు బయటపడటంతో స్థానికంగా కలకలం రేగింది. మూడు రోజుల క్రితం సూడాన్‌ దేశం నుంచి వచ్చి సత్యనారాయణ కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయ్యిందని హయత్‌నగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ మారుతీ దివాకర్‌ తెలిపారు. దీంతో అధికారులు ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులకూ పరీక్షలు నిర్వహించారు. అతడి ప్రాథమిక కాంట్రాక్ట్‌లపై దృష్టి పెట్టి కాలనీలోని మరో 30 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్‌ వచ్చింది.  

>

>
మరిన్ని వార్తలు