-

ఆ 32 నియోజకవర్గాల్లో.. గల్ఫ్‌ కార్మికులు, చెరకు రైతులది కీలకం

28 Nov, 2023 08:04 IST|Sakshi

చెరకు సాగు.. నిజాం షుగర్స్‌ 

సాక్షి, నిజామాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం ఫలితాన్ని తారుమారు చేసిన సంగతి తెలిసిందే. పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్‌ రైతులకు బాండ్‌ రాసిచ్చిన నేపథ్యంలో ఎంపీగా ప్రజలు పట్టం కట్టారు. ఈ శాసనసభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలనే లక్ష్యంతో  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాని మోదీ ద్వారా పసుపు బోర్డు ప్రకటన చేయించింది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఈ అంశం అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపడం లేదనే చెప్పాలి. ఇప్పుడు గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం, నిజాం షుగర్స్‌ అంశాలే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, వరంగల్‌ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో (మొత్తం 32 నియోజకవర్గాలు) సుమారు 15 లక్షల మంది గల్ఫ్‌ కార్మికులు ఉన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు అంతగా లేకపోవడంతో గల్ఫ్‌కు వలస వెళ్లారు. ఈ కార్మిక కుటుంబాలు తమ సంక్షేమం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.

ప్రత్యేకంగా గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్‌ జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి దొనికెన కృష్ణ(స్వతంత్ర), వేములవాడ నుంచి గుగ్గిల్ల రవిగౌడ్, నిర్మల్‌ నుంచి స్వదేశ్‌ పరికిపండ్ల, ధర్మపురి నుంచి భూత్కూరి కాంత, కోరుట్ల నుంచి చెన్నమనేని శ్రీనివాసరావు ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరుపున బరిలో ఉన్నారు. గల్ఫ్‌ జేఏసీ నాయకులు గల్ఫ్‌ దేశాల్లో పర్యటించి వలస కార్మికులతో సమావేశమై ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా ప్రచారం చేశారు.

ముఖ్యంగా సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా గల్ఫ్‌యేతర దేశాల్లో మరణించిన వారి మృతదేహాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో తెప్పిస్తోంది. గల్ఫ్‌ మృతుల విషయంలో మాత్రం వివక్ష కనిపిస్తోందన్న విమర్శ ఉంది. గల్ఫ్‌ బోర్డు ఏర్పడితే ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని ఆ కార్మికులు చెబుతున్నారు. నిజాం షుగర్స్‌ అంశాన్ని సైతం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. తాము గెలిస్తే నిజాం షుగర్స్‌ యూనిట్లను తెరిపిస్తామని హామీ ఇస్తున్నాయి.

తద్వారా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో చెరకు రైతులను ఆకట్టుకునేందుకు ప్రచారం చేస్తున్నాయి. చెరకు పంట విస్తీర్ణం పెంపు విషయమై రెండు జాతీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. బోధన్‌ (ఉమ్మడి నిజామాబాద్‌), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్‌), ముత్యంపేట (ఉమ్మడి కరీంగనర్‌) జిల్లాల్లోని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలను తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెరిపిస్తామని ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ సైతం ప్రకటించారు.  

గల్ఫ్‌ బోర్డు ద్వారానే సమస్యలు పరిష్కారం.. 
 గల్ఫ్‌ బోర్డు ద్వారానే వలస కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయి. వలస కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలి. గల్ఫ్‌ ప్రవాసులను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. గల్ఫ్‌ ప్రవాసుల ద్వారా ప్రతి ఏటా సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం  ప్రభుత్వాలకు లభిస్తోంది. 
– మంద భీమ్‌రెడ్డి, గల్ఫ్‌ వ్యవహారాల విశ్లేషకుడు
 
చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధ్దరించాలి.. 
ఏళ్ల తరబడి చెరకు పంట పండిస్తున్నాం. మా ప్రాంత భూములు చెరకు పంటకు అనుకూలమైనవి. ఈ సీజన్‌లోనూ 5 ఎకరాల్లో చెరకు పండిస్తున్నాను. బోధన్‌ నిజాం షుగర్స్‌ను మూసేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. బోధన్‌ ఫ్యాక్టరీని మూసినప్పటి నుంచి కామారెడ్డి జిల్లాలోని గాయత్రి షుగర్స్‌కు తరలించి అమ్ముతున్నాం. బోధన్‌ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తే మాకు మేలు కలుగుతుంది. కొత్త ప్రభుత్వం నిజాం షుగర్స్‌నూ పునరుద్ధరించాలని ఆకాంక్షిస్తున్నాం.    
– పల్లె గంగారాం, రైతు, హున్స గ్రామం, సాలూర మండలం

మరిన్ని వార్తలు