చల్లటి కబురు.. మూడు రోజుల్లో నైరుతి!

5 Jun, 2021 08:03 IST|Sakshi

మూడు రోజుల్లో నైరుతి!

రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి పులకరించనుంది. అతి త్వరలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కొంత భాగంలోకి వ్యాపించాయి. రానున్న రెండుమూడు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రానికి దక్షిణ దిశలో ఉన్న జిల్లాల్లో రుతుపవనాలు ముందుగా ప్రవేశించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైంది. అయితే, రాష్ట్రంలో రుతుపవనాల సీజన్‌ అప్పుడే కనిపిస్తోంది. నైరుతి ప్రవేశానికి ముందుగానే వానలు కురుస్తున్నాయి. సాధారణ వర్షపాతం నుంచి భారీ, అతిభారీ వానలు గత రెండుమూడు రోజులుగా నమోదవుతున్నాయి. సీజన్‌కు ముందే వర్షాలు కురవడంతో రైతాంగంలో నూతనోత్సాహం నిండుతోంది. మరోవైపు వేసవి ఉష్ణోగ్రతలతో ఉక్కపోతకు గురైన ప్రజలు కాస్త చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా, రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా నైరుతి, ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. 

ఈసారీ భారీ వర్షాలే...
రాష్ట్రంలో ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గతేడాది రుతుపవనాల రాక ఆలస్యమైనా... చివరి రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర సాధారణ వర్షపాతం 72.04 సెంటీమీటర్ల వర్షపాతం ఉండగా సీజన్‌ ముగిసేనాటికి 107.83 సెం.మీ వర్షపాతం నమోదైంది. సాధారణంకంటే 50 శాతం అధికంగా వానలు కురిశాయి. గత సీజన్‌తో పోలిస్తే 5 శాతం తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ లెక్కన సాధారణ వర్షపాతాన్ని మించి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా  రాష్ట్రంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి మొదలుకుని భారీ వర్షాలు కురిసాయి. వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. 

చదవండి: థర్డ్‌వేవ్‌ తీవ్రత: ఆ మూడే కీలకం!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు